
నవ నిర్మాణానికి తొలి అడుగు
వచ్చే నెలలో వారం రోజులు నగరంలోనే ముఖ్యమంత్రి
‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు
ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో నిమగ్నం
చంద్రబాబు క్యాంపు కార్యాలయం సిద్ధం
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగానే వచ్చే నెలలో ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి వచ్చేనెల మొదటి వారానికి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనే వివరాలు విజయవాడ లేదా గుంటూరును వేదికగా చేసుకుని ప్రజలకు చెప్పాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల్లో హడావుడి మొదలైంది.
మూడో తేదీ నుంచి ‘నవ నిర్మాణ దీక్ష’
రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండో తేదీనే స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కార్యాలయానికి కావాల్సిన హంగులన్నీ రెడీ అయ్యాయి. ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో వచ్చేనెల మొదటి వారంలో అంటే.. జూన్ మూడు నుంచి ఎని మిదో తేదీ వరకు వారం రోజులు సీఎం విజయవాడ కేంద్రంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు నుంచి ఏడో తేదీ వరకు నవ నిర్మాణ దీక్షలు చేస్తారు. ఈ దీక్షల ద్వారా తాము చేసినవన్నీ మంత్రులు, అధికారులు ప్రజలకు చెప్పుకొనే ప్రయత్నం చేస్తారు. ఎనిమిదిన బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభను విజయవాడలోనే నిర్వహించాలని కొందరు చెబుతుండగా, మరికొందరు రాజధాని నిర్మాణం చేపట్టబోయే ప్రాంతంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఈ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే పోలీసుల పని తీరుకు మరింత పదును పెట్టాల్సి ఉంటుంది. ఈ పనిలోనే పోలీస్ కమిషనర్ నిమగ్నమయ్యారు. రెండో తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తే అందుకు సంబంధించి బందోబస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు
రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు బాధ్యతను మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడికి అప్పగించారు. కలెక్టర్లతో ఇప్పటికే నారాయణ ఎన్నోసార్లు ఈ విషయాలపై మాట్లాడారు. గన్నవరంలోని మేథ టవర్‌లో ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చో ఆలోచిస్తున్నారు. బందర్ రోడ్డులోని గోకరాజు టూరిజం టవర్‌లో కూడా ఎన్ని కార్యాలయాలు ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అంశపై చర్చ జరుగుతోంది. వీటిపై కలెక్టర్ ఒకటి రెండు రోజుల్లో మంత్రులకు తగు నివేదికలు సమర్పించే అవకాశం ఉంది.
టూరిజం, మత్స్య పాలసీపైనే దృష్టి
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో టూరిజం, మత్స్య పాలసీ ముఖ్యమైనవి. ఈ రెండు పాలసీలు జిల్లా ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. టూరిజం కేంద్రంగా ఇప్పటికే విజయవాడ చాలావరకు అభివృద్ధి చెందింది. పీపీపీ పద్ధతుల్లో పలు సంస్థలకు టూరిజంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీష్ పాలసీలో మత్స్యకారులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తారు. సముద్రంలో వేట నిషేధించిన మూడు నెలలూ.. నెలకు రూ.4వేల వంతున సాయాన్ని మత్స్యకారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అదేకాకుండా, అధునాతన పరికరాలు కూడా వారికి ఇస్తారు. చేపలు పట్టుకునేందుకు, పెంచుకునేందుకు ముందుగా వారికి అవకాశాలు ఇచ్చిన తరువాతే ఇతరులకు ఇస్తారు.
పీపీపీ పద్ధతిలో మత్స్య పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు ఇస్తారు. ముఖ్యంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల జిల్లాలో ఎక్కువ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు కూడా ఎక్కువగా జరుగుతాయి. కృష్ణానదిలో చేపలు పెంపకం, పట్టుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సముద్రంలో ఇక ప్రత్యేకంగా చెప్పేది లేదని, మత్స్యకారులు ఏది మంచి అనుకుంటే అది చేయవచ్చనని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.