
సాక్షి, అమరావతి: యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్‌ఐడీవో) అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు విజయవాడ, గుంటూరు ఎంపికయ్యాయి. వీటితోపాటు రాజస్థాన్‌లోని జైపూర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, కర్ణాటకలోని మైసూరులను కూడా పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేశారు. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఎన్ హ్యాబిటాట్, జీఈఎఫ్ (గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ) సంస్థల భాగస్వామ్యంతో యూఎన్‌ఐడీవో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనుంది.
ఈ ఐదు నగరాల సుస్థిరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, అవసరమైన పెట్టుబడులు, సామర్థ్యం పెంపు, నాలెడ్జ్ బదిలీ అంశాల్లో యూఎన్‌ఐడీవో ఈ కార్పొరేషన్లకు చేయూతనివ్వనుంది. మొదటి దశలో విజయవాడ, గుంటూరుల్లో సుస్థిరాభివృద్ధి స్థితి ఎలా ఉందో అధ్యయనం చేస్తుంది. దీన్నిబట్టి విజన్‌ను రూపొందించుకుని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంటుంది. అనంతరం వాటిని అభివృద్ధి చేయడానికి ఉన్న వనరులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టును అమలు చేస్తుంది. భాగస్వామ్య సంస్థలతో కలిపి పెట్టుబడులు పెట్టాలనుకున్న అంశాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలపై సవివర నివేదికలు రూపొందిస్తుంది.
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లలో ప్రధానంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రవాణా నెట్‌వర్క్ అభివృద్ధి, కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాల్లో ఆర్థిక సహకారం అందించే అవకాశాలున్నాయి. యూఎన్‌ఐడీవో ప్రతినిధి బృందం తన అధ్యయనంలో భాగంగా రెండు రోజులుగా విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తోంది. కార్పొరేషన్ల అధికారులు, సీఆర్‌డీఏ కమిషనర్‌తో సమావేశమై ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు సంబంధించిన వివరాలు సేకరించింది.