
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించే నాణేలను వేగవం తంగా లెక్కించేందుకు నూతన యంత్రాలు కొనుగోలు చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణిలో నాణేలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు లెక్కించేందుకు వీలుగా అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామ న్నారు. చిల్లర కానుకల్ని లెక్కించేందుకు వీలుగా తిరుపతిలో ప్రత్యేకంగా భవనం నిర్మిస్తున్నామని, నవంబరు 30 నాటికల్లా పూర్తిచేస్తామని చెప్పారు.
హుండీ ద్వారా సమకూరే కానుకలు రోజువారీగా టీటీడీ ఖాతాలో చేరే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా పరకామణి సేవలో అవకాశం ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు.