
జిల్లాకు కొత్త ఎస్పీలు
ఏటీఅగ్రహారం (గుంటూరు): జిల్లాలోని ముగ్గురు ఎస్.పిలు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా గుంటూరు అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ తిరుపతి అర్బన్ ఎస్పీగా, గుంటూరు రూరల్ ఎస్పీ జక్కంశెట్టి సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ విభాగానికి వెళుతున్నారు. విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసినా పోస్టింగ్ ఎక్కడనేది పేర్కొనలేదు.
నూతన ఎస్పీలు వీరే...
కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో కమాండెంట్‌గా పనిచేస్తున్న ఎస్పీ రాజేష్‌కుమార్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీగా నియమించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ సీహెచ్ రామకృష్ణను గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా నియమించారు.
హైదరాబాద్‌లోని సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ కేవీ మోహన్‌రావును గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోహన్‌రావు 2011 మార్చి నుంచి 2012 ఏప్రిల్ వరకూ విజిలెన్స్ ఎస్పీగా ఇక్కడే పనిచేశారు. 2012లో ఐపీఎస్ గుర్తింపునిచ్చి మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా పంపారు.
2009 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ జెట్టి గోపీనాథ్ 2012 మార్చిలో అర్బన్ జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది నవంబర్‌లో ఎస్పీగా పదోన్నతి పొందారు. సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు.
2003 బ్యాచ్‌కు చెందిన జె. సత్యనారాయణ 2012 ఏప్రిల్ 16న రూరల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమర్థంగా పనిచేశారు. ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టుల జిల్లాకమిటీ సభ్యుడు జానాబాబురావుతోపాటు మరో ఇద్దరు మావోయిస్ట్‌లను మట్టుబెట్టి కొత్త రిక్రూట్‌మెంట్‌లు జరగకుండా చూడటంలో కీలకపాత్ర పోషించారు. జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఆర్.ఎన్. అమ్మిరెడ్డి 2012 నవంబర్ 5వ తేదీన నల్గొండ నుంచి బదిలీపై వచ్చి గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అనేక మంది ప్రజాప్రతినిధులు కలుగజేసుకుని చెప్పినప్పటికీ ఎక్కడా తొణక్కుండా విధులు నిర్వహించారు.