ఓటర్ల నమోదు కార్యక్రమం
Published Tue, Dec 3 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఓటికుండ వ్యవహారంలా మారింది. ఒక వైపు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ మరో వైపు హక్కు ఉన్నవారికి ఓటులేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యమనే పునాది నిర్మాణానికి మూలస్తంభం ఓటు. అంతటి ప్రాధాన్యం ఉన్న విషయంలో ఓటరుగా చేరడానికి యువత ఆసక్తి కనబరచడం లేదు. దానికి తోడు ఓ వైపు ఓటు వజ్రాయుధం అని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఓటర్ల నమోదు కన్పించడం లేదు. దీనిపై పాలకులు సైతం పెద్దగా శ్రద్ధ కనుబరచడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగానే ఉంటున్నాయి. యువత భాగస్వామ్యం పెరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న కొంతమంది నేతలు
పూర్తిస్థాయిలో ఓటరు నమోదుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ప్రత్యేక కార్యక్రమాల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓటరుగా చేరడానికి వేలాది మందికి అవకాశం ఉన్నప్పటికీ ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీని వల్లే 50 ఏళ్లు వయసున్న కొంతమందికి ఓటు లేకుండా పోయింది. బొండపల్లి మండలంలో ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ఇక్కడ బీఎల్‌ఓలుగా ఉన్న వారిలో అధికంగా అధికార పార్టీనాయకులు,వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండే వారే కావడంతో తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతులతో పాటు ఎక్కడా ఓటు లేకుండా ప్రస్తుతం అదే గ్రామంలో స్థిరనివాసం ఉంటున్నప్పటికీ వారికి ఓటరుగా చేరే అవకాశం లభించడం లేదు. అవకతవకలకు పాల్పడుతున్న వారిపై ఎటువంటిచర్యలు తీసుకోవడం లేదు.
ఇదీ పరిస్థితి
జిల్లా జనాభా 23.42 లక్షలు. అందులో 16.19 లక్షల మంది ఓటర్లు. వారిలో మహిళా జనాభాతో పాటు మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే 18 ఏళ్లు దాటిన యువఓటర్ల నమోదు అంతంతమాత్రంగానే ఉంది. జనాభా ప్రకారం 68.34 శాతం మంది ఓటర్లు ఉండాలి. జిల్లాలో ఆ సంఖ్య పెరగాల్సి ఉంది. అలాగే జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా కేవలం ఇప్పటివరకూ 22వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. ఈ పరిస్థితి చూస్తే యువత ఓటరుగా నమోదులో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో స్పష్టమవుతోంది. ప్రభుత్వ అధికారుల సన్నాహాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ప్రచారానికే పరిమితమవుతున్న ప్రత్యేక క్యాంపులు...
శతశాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా సిద్ధం చేయడమే లక్ష్యమని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకు పొంతన లేకుం డా పోతోంది. డిసెంబర్ 10 వరకూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి గాను ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటు చేర్పు,మా ర్పులు,తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలి. దీనికోసం బీఎల్‌ఓలు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉండి క్లెయిములు స్వీకరించాలి. అయితే ఇది ప్రచారం వరకూ బాగానే జరుగుతున్నా అనేక కేంద్రాల్లో బీఎల్‌ఓలు పత్తా ఉండడం లేదు.
ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కంటోన్మెంట్ ఆర్‌సీఎం పాఠశాల ఆవరణలో బీఎల్‌ఓ లేరు. ఇక్కడ ఓటరుగా నమోదయ్యేందుకు వచ్చిన వారు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడ ఫోన్ నంబరు కోసం వెతికారు. అది కూడా కన్పించక పోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి కొంతమంది ‘ న్యూస్‌లైన్’ రిపోర్టర్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. అధికారులకు సమాచారం అందించడంతో ఎట్టకేలకు ఆర్‌ఐని కేంద్రంలో అందుబాటులోకి తెచ్చారు. పట్టణం నడిబొడ్డున ఉన్న పాఠశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదేమో.
ఈమె పేరు బి. రాజమ్మ. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. వయస్సు 45 సంవత్సరాలు పైనే. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈమె ఓటు వేసింది. విచిత్రమేమిటంటే ఓటరు జాబితాలో ఇప్పుడు ఈమె పేరు లేదు. ఈ మధ్యకాలంలోనే విషయం తెలిసింది. ఓటు హక్కు కోసం మళ్లీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఈమె అయోమయంలో ఉంది.
ఈమె పేరు పి. రామలక్ష్మి. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. ఈమెకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రేషన్ కార్డు కూడా ఉంది. ఓటు హక్కు కోసం రెండు దఫాలు దరఖాస్తు చేసుకుంది. అయినా ఓటరు జాబితాలో పేరు లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement