
వచ్చే నెల చివరిలో నిట్ తరగతులు
వచ్చేనెల ఆఖరి వారంలో నిట్ తరగతులను తాడేపల్లిగూడెంలో ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మానవ వనరులు, విద్యా శాఖమంత్రి గంటాశ్రీనివాసరావు చెప్పారు.
తాడేపల్లిగూడెం : వచ్చేనెల ఆఖరి వారంలో నిట్ తరగతులను తాడేపల్లిగూడెంలో ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మానవ వనరులు, విద్యా శాఖమంత్రి గంటాశ్రీనివాసరావు చెప్పారు. నిట్ ప్రతిపాదిత భూములు, నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించే భవనాలను పరిశీలించేందుకు శనివారం వచ్చిన ఆయన పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్‌కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్న నిట్‌లో ఇప్పటికే 395 సీట్లు భర్తీ అయ్యాయన్నారు.
నిట్ శాశ్వత భవనాల నిర్మాణం కోసం 172 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి నిట్ తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పించామన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయూలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంచేశారన్నారు.
దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపించారన్నారు. బుధవారం లోపు స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని మంత్రి గంటా తెలిపారు. దేశంలో ఏ నిట్‌లోనూ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబోయే నిట్‌కు 450 సీట్లు మంజూరు చేశారని, మరో 60 సీట్లను సూపర్ న్యూమరరీగా ఇచ్చారని, దీంతో 540 సీట్లు కేటాయించినట్లయిందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ నిట్‌ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసేందుకు స్థలానికి సంబంధించి ఎదురైన సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.
విమానాశ్రయ భూముల్లోని 172 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. స్థలం లేని కారణంగా నిట్ తాడేపల్లిగూడెం నుంచి వేరే ప్రాంతానికి తరలిపోతుందన్న సమయంలో ఈ ప్రాంత రైతులు 300 ఎకరాల భూమిని అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. నిట్ తాత్కాలిక తరగతులకు, వసతి సౌకర్యం ఇస్తున్న వాసవి ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ సభ్యులను అభినందించారు. ముందుగా మంత్రులు నిట్ ప్రతిపాదిన భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, వాసవి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ జె.శ్రీహరి, తహసిల్దార్ పాశం నాగమణి, సర్వేయర్ రౌతు రామకృష్ణ తదితరులు వారి వెంట ఉన్నారు.
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి, కళాశాలల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు ప్రతి విద్యార్థికి బార్ కోడింగ్ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. కుల, మత సంఘాలకు సంబంధించి ఎటువంటి ప్రచార బోర్డులను అనుమతించేది లేదన్నారు. గతంలో విద్యాభివృద్ధికి 10 శాతంకు మించి బడ్జెట్ ఉండేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం దానిని 17 శాతానికి పెంచి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
విద్యతోపాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు బివీ పట్టాభిరామ్, చాగంటి కోటేశ్వరరావు వంటి వారితో విద్యాసంస్థల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యంతోపాటు బయోమెట్రిక్ పద్ధతి, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తామన్నారు.