బరిలో నిలిచేదెవరో?
- నేడు తేలనున్న లెక్కలు
- ఏకగ్రీవాల కోసం రాత్రి రాజకీయాలు...
- జోరుగా గ్రూపుల మంతనాలు
- బలమైన అభ్యర్థులను దింపేందుకు {పధాన పార్టీల వ్యూహం
- బి-ఫారం ఇవ్వకుంటే స్వతంత్రులే
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ముఖ చిత్రం నేడు స్పష్టంకానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగియనుండడంతో తుది పోరులో అభ్యర్థులు ఎవరన్నది కొలిక్కి రానుంది. నామినేషన్ల సమర్పించిన వారిలో ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే ఉపసంహరించుకున్నారు.
ఇంకా ఒక్కో స్థానానికి ఒక పార్టీ నుంచి ముగ్గురు నుంచి 10 మంది వరకు పోటీ ఉన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అధికారులు వివిధ కారణాలతో ఆరింటిని తిరస్కరించారు. దీంతో ప్రస్తుతం 381 నామినేషన్లు ఉన్నాయి.
శని,ఆదివారాల్లో భారీగా నామినేషన్ల ఉపసంహరణలు ఉంటాయని అధికారులు భావిం చారు. అయితే కేవలం ఐదుగురు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు యుగియనుండడంతో భారీగా ఉపసంహరణలు ఉండే అవకాశాలు ఉన్నాయి.
తగ్గనున్న నామినేషన్లు
కొంత మంది అభ్యర్థులు నాలుగైదు సెట్లు నామినేషన్లు వేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో డెమ్మీలగానూ వేయించారు. ఎన్ని సెట్లు వేసినా అన్నింటిని ఒకటిగానే పరిగణిస్తారు. అలాగే అభ్యర్థుల డెమ్మీలు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ విధంగా 100 వరకు నామినేషన్లు సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావి స్తున్నారు.
జోరందుకున్న బుజ్జగింపులు
ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. నయోనో, భయానో వారిని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీల అగ్రనాయకులు రంగంలోకి దిగారు. గడువు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులకు దీటైన వారిని పోటీలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో రెబల్స్ వల్ల నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో నాయకులు అభ్యర్థులకు తాయిళాల ఎరవేస్తూ వారిని సర్ధిచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారు. రాత్రిళ్లు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం లోగా వీరిని ఓ దారికి తెచ్చుకోకుంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న భయం అన్ని పార్టీలను వెంటాడుతోంది.
వామపక్ష పార్టీలు, బీజేపీ మినహా మిగిలిన అభ్యర్థులందరూ బి-ఫారం లేకుండానే పార్టీల పేరు మీద నామినేషన్లు వేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గం టలలోగా అభ్యర్థులు బి-ఫారంను అధికారులను సమర్పించాల్సి ఉంది. భి-ఫారం ఇవ్వనిపక్షంలో వారిని సత్వంత్రులుగానే పరిగణిస్తారు. ఇండిపెండెంట్లుగానే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.