నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలింది. ఇక మిగిలింది ప్రచారమే. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
సాక్షి, కడప : నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలింది. ఇక మిగిలింది ప్రచారమే. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు, కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ప్రచారానికి 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది.
అప్పట్లోగా నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రచారాన్ని పూర్తి చేయాలి. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పగటిపూట ప్రచారానికి అధిక సమయా న్ని కేటాయించలేక పోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండలు మరీ తీవ్రతరం అవుతుండటంతో ప్రచారాన్ని నిలిపి వేయాల్సి వస్తోంది. అభ్యర్థి అర్ధరాత్రి దాటినా ఇంటికి చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మంతనాలు, బుజ్జగింపులకు రాత్రి సమయాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
సాదాసీదా ప్రచారాలు
పార్టీల తరుపున ముఖ్య నేతలు ప్రచారానికి వస్తే తప్ప దాదాపు ఇంటింటి ప్రచారమే చేస్తున్నారు. దీంతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓట్ల వేట జరుగుతోంది. అక్కడక్కడ ప్రచార రథాల జోరు తప్ప మిగతా ఏవీ కనిపించడం లేదు. 2009 ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించి ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, గోడలపై రాతలతో ఎన్నికల కోలాహలం కనిపించేది. ప్రస్తుతం ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. నిబంధనలు కఠినతరం చేయడంతో వాహనాలను సైతం ఎన్నికల అధికారుల అనుమతితో వినియోగించుకోవాల్సి వస్తోంది.