ఓటేద్దాం రండి..
తుది సమరం మొదలైంది. ఓటరు దేవుళ్ల తీర్పుకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు సమస్తం సిద్ధమైంది. ‘గ్రేటర్’లో
24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 లోక్‌సభ స్థానాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6309 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 511 మంది అభ్యర్థులు, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఆలస్యమెందుకు... ఓటుహక్కు వినియోగించుకుందాం.. ఓటు విలువ చాటిచెబుదాం.
సాక్షి, సిటీబ్యూరో: హోరాహోరీ ప్రచారం.. వాగ్దానాల పరంపరలన్నీ ముగిసిపోయి.. నిశ్శబ్ద వాతావరణం అనంతరం ‘కీ’లక సమయం ఆసన్నమైంది. ఐదేళ్లపాటు తమ భవిష్యత్‌ను నిర్ణయించే వారి జాతకాలను నిర్ణయించేందుకు గ్రేటర్ ఓటర్లు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో తమ తీర్పు ఏమిటో చెప్పనున్నారు. ఎవరెన్ని హామీలిచ్చినా.. ఎవరేం ప్రలోభాలకు గురిచేసినా.. అన్నీ ఆలకించిన ఓటర్లు అంతిమంగా తమ నిర్ణయం ఏమిటో ఈవీఎంల ద్వారా తెలుపనున్నారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ఎన్నికల్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమైదైన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో 53 శాతం మాత్రమే ఉన్న పోలింగ్‌ను 70 శాతానికి పెంచాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఓటరు అవగాహన కార్యక్రమాలు.. ఓటేయాలని విస్తృత ప్రచారం.. ఆన్‌లైన్ ద్వారా ఓటరు జాబితాలో పేరు నమోదు.. కొత్తతరం ఓటర్లు పెరగడం.. ప్రస్తుత రాజకీయ స్థితి.. తదితర పరిణామాలు పోలింగ్ శాతాన్ని పెంచగలవనే భావిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 24 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా.. ప్రశాంతంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. క్యూలోని వారికి ఎండ తగలకుండా అవసరాన్ని బట్టి షామియానాలు.. దాహం తీర్చేలా మంచినీరు తదితర కనీస సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలుగా 50 కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శిక్షణ పొందిన సిబ్బందితోపాటు తగినన్ని ఈవీఎంలు, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉన్న వారందరూ ఓటుహక్కు వినియోగించుకోవచ్చునన్నారు.
ఎంత సమయం పట్టినా వారందరూ ఓటు వేయవచ్చునన్నారు. క్యూలోని చివరి వ్యక్తి వరకు గుర్తించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. 6 గంటల తర్వాత వచ్చే వారికి మాత్రం ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల తీరును పరిశీలించేందుకు, పారదర్శకత కోసం వెబ్‌క్యాస్టింగ్ టీమ్‌లు ఉంటాయన్నారు. పోలింగ్ ప్రక్రియను సీడీల్లోనూ భద్రపరుస్తామన్నారు. ఓటర్లందరూ ఓటుహక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాలో పేరుంటే చాలు.. ఓటరుస్లిప్ అందకపోయినా నిర్ణీత 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చునని స్పష్టం చేశారు. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉంది వంటి విషయాలను కూడా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓట్ల వివరాలు తెలిపేందుకు 1480 భవనాల్లోని 3386 పోలింగ్ కేంద్రాల వద్ద ఈ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల కోసం 22,348 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను నియమించామన్నారు. వీరితోపాటు 255 మంది సెక్టోరల్ అధికారులు, 1482 మంది అదనపు సెక్టోరల్ అధికారులు ఉంటారన్నారు. అందరూ ఓటు వేసేందుకు వీలుగా 30వ తేదీన జిల్లాలోని అన్ని హోటళ్లు, మాల్స్, థియేటర్స్, పార్కులు మూసివే యనున్నట్లు తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని మొత్తం పోలింగ్ కేంద్రాలు : 6309
వీటిలో హైదరాబాద్ జిల్లా పరిధిలోవి : 3386
మిగతావి రంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు
నియోజకవర్గం పరిధిలోవి.
హైదరాబాద్ జిల్లాలో అందుబాటులోని ఈవీఎంలు..
బ్యాలెటింగ్ యూనిట్లు: 15,499
కౌంటింగ్ యూనిట్లు: 9750
వీటిల్లో అవసరమైనవి పోను చాలినన్ని ఈవీఎంలు రిజర్వులోనూ ఉన్నాయని కమిషనర్ చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు:
పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు: టాయ్‌లెట్లు, తాగునీరు( రెండు డ్రమ్ములు, సాచెట్లు).
వికలాంగులకు అవసరమైన ర్యాంపులు
అంధులకు బ్రెయిలీ లిపి ఈవీఎంలు
విద్యుత్ సదుపాయం
ప్రాథమిక చికిత్స కిట్స్
గ్రేటర్ నియోజకవర్గాలివీ...
అసెంబ్లీ నియోజకవర్గాలు:
1.ముషీరాబాద్
2.మలక్‌పేట్
3.అంబర్‌పేట్
4.ఖైరతాబాద్
5.జూబ్లీహిల్స్
6.సనత్‌నగర్
7.నాంపల్లి
8.కార్వాన్
9.గోషామహల్
10.చార్మినార్
11.చాంద్రాయణగుట్ట
12.యాకుత్‌పుర
13.బహదూర్‌ఫుర
14.సికింద్రాబాద్
15.కంటోన్మెంట్
16.మల్కాజిగిరి
17.కుకట్‌పల్లి
18.కుత్భుల్లాపూర్
19.ఉప్పల్
20.ఎల్బీనగర్
21.మహేశ్వరం
22.రాజేంద్రనగర్
23.శేరిలింగంపల్లి
24.పటాన్‌చెరు
లోక్‌సభ నియోజకవర్గాలు
1.హైదరాబాద్
2.సికింద్రాబాద్
3.చేవెళ్ల
4.మల్కాజిగిరి
5.మెదక్
ఓటర్ల వివరాలివీ...
హెదరాబాద్ జిల్లా పరిధిలో..
పురుషులు : 21,02,552
స్త్రీలు : 18,61,454
ఇతరులు:472
మొత్తం:39,64,478
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
పురుషులు : 2109584
స్త్రీలు : 1773691
ఇతరులు:506
మొత్తం: 38,83,781
హైదరాబాద్ + రంగారెడ్డి జిల్లాల్లోని
మొత్తం ఓటర్లు : 78,48,259
గ్రేటర్‌లోనే ఉన్న మెదక్‌జిల్లా పరిధిలోని
పటాన్‌చెరు డివిజన్ ఓటర్లు 2,93,768
మొత్తం ఓటర్లు 81,42,027