నాలుగు ఘటనల్లో 9 మంది మృతి
సాక్షి, నెల్లూరు: ఏ క్షణానికి ఏమి జరుగునో ఊహించలేం. దీనికి నిదర్శనంగా జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో రెండు ఘటనలు అలా జరుగుతాయని కలలో కూడా ఊహించలేని పరిస్థితి. బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని పోలినాయుడు చెరువు గ్రామంలో వరి ధాన్యం రాశుల వద్ద కాపలాగా నిద్రిస్తున్న రైతులు ఖాజారంతుల్లా, ఆవుల మల్లారెడ్డి పైకి ఇసుక ట్రాక్టర్ దూసుకెళ్లి బోల్తాపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
నెల్లూరు శివారులోని సుందరయ్యకాలనీ వద్ద ఉదయం 8 గంటల సమయంలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎన్నికల విధుల్లో భాగంగా బెంగళూరు వెళ్లిన బీహార్ పోలీసులు తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. వీరి కారు టైరు పంక్చర్ కావడం రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయంలో ఓ అధికారి అస్వస్థతకు గురవడంతో చికిత్స అందించేందుకు 108కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది. కారుతో పాటు అంబులెన్స్‌ను కంటైనర్ ట్రాలీ ఢీకొనడంతో ముగ్గురు బీహార్ పోలీసులు, ఇద్దరు సుందరయ్య కాలనీ వాసులు మృతిచెందారు.
స్థానికులైన మధుప్రభాకర్(16), నాగేశ్వరరావు(40) పోలీసులకు సాయం చేయడానికి వచ్చిన వారు. నగరంలోని నవాబుపేట బంగ్లాతోటలో క్రాంతి ఇంగ్లిష్ మీడియం స్కూలులో ఫేర్‌వెల్‌పార్టీ ఏర్పాట్ల కోసం ఇనుప కమ్మిని తీసుకెళుతుండగా విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి అజీమ్(15) అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థి వినీత్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోటమండలం చంద్రశేఖరపురంలో జరిగిన ప్రమాదంలో ప్రభుదాస్ మృతి చెందాడు. ఈ నాలుగు ఘటనలతో జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు.
మృత్యుఘోష
Published Mon, Mar 17 2014 3:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement