ప్రతీకాత్మక చిత్రం
రామవరప్పాడు (గన్నవరం): విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థినులు శనివారం తరగతి గదిలో మద్యం తాగి హడావుడి చేయడం ఆలస్యంగా వెలుగుచూసింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తమ వెంట తెచ్చుకున్న మద్యంను శీతల పానీయంలో కలుపుకుని తరగతి గదిలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తూ హడావుడి చేశారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అతను బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వైద్యుడి సమక్షంలో బాలికలు మద్యం తాగారని నిర్థారించారు. దీంతో బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరి ప్రవర్తన తోటి విద్యార్థులకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థినులకు టీసీలిచ్చి పాఠశాల నుంచి పంపించి వేశారు.
గతేడాది పాఠశాలలో చేరారు :హెచ్‌ఎం సురేష్‌కుమార్
ఈ ఇద్దరిలో ఓ విద్యార్థిని నగరంలోని ఓ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివింది. అక్కడ పాఠశాలలో కూడా విద్యార్థిని ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీసీ ఇచ్చి పంపించేయడంతో మా పాఠశాలలో చేరింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలో పక్కా చర్యలు చేపడుతున్నాం. అన్నీ తరగతి గదులు, హాల్స్‌లో సుమారు 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తాం. మద్యం తాగిన ఇద్దరు విద్యార్థినులతో మిగిలిన విద్యార్థులకు కూడా నష్టం కలుగుతుందన్న కారణంతో టీసీలు ఇచ్చి పంపించేశాం.
Comments
Please login to add a commentAdd a comment