మంత్రి ఫరూక్, తనయుడు ఫిరోజ్ ఓటర్లుగా ఉన్న జాబితా
సాక్షి, నంద్యాలఅర్బన్: డేటా స్కాంలో అధికార పార్టీ పరువు పోవడంతో దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పడరానిపాట్లు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇందులో భాగంగానే నంద్యాలకు చెందిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తమ కుటుంబానికి చెందిన ఏడుగురి ఓట్లను వైఎస్సార్‌సీపీ నాయకులు తొలగించారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు.
దీనికి ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. నంద్యాల పట్టణంలోని ముల్లాన్‌పేట 72వ పోలింగ్ బూత్‌లో మంత్రి ఫరూక్ భార్య మెహబూబ్‌చాంద్, కుమారుడు ఫయాజ్, కుటుంబ సభ్యులు షబ్రాన్‌సుల్తాన్, యాస్మిన్‌మొబిన్, సీఫా ఫాతిమా, సౌదాఫ్ ఫాతిమా, ఫర్హానా పేర్లు తొలగించారంటూ మంత్రి చెబుతున్నారు. అయితే.. ఫరూక్ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యంతోనే ఓట్లు తొలగిపోయినట్లు తెలుస్తోంది. 2017 నవంబర్ ఒకటి నాటికే వారి ఓట్లు జాబితాలో లేవు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఓటర్లుగా నమోదు చేయించడానికి స్థానిక సిబ్బంది ప్రయత్నించినా..ఫరూక్ కుటుంబ సభ్యులు స్పందించలేదని సమాచారం. బయట రాజకీయంగా తిరుగుతున్న మంత్రి ఫరూక్, కుమారుడు ఫిరోజ్ ఓట్లు మాత్రం జాబితాలో ఉన్నాయి. మిగిలిన కుటుంబ సభ్యుల ఓట్లు లేకపోవడానికి వారి నిర్లక్ష్యమే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి మాత్రం వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు.
ఎలాంటి ఆధారమూ లేకుండా మంత్రి చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల సమాచారాన్ని దొంగలించి అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ..ఇప్పుడిలా దుష్ప్రచారానికి పూనుకుందని విమర్శిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల ఓట్ల తొలగింపుపై వివరణ ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ నిరాకరిస్తున్నారు. ఎప్పుడో జరిగిన తొలగింపుతో తమకు సంబంధం లేదని అంటున్నారు. కాగా.. గురువారం మంత్రి కుటుంబ సభ్యుల ఓట్లు చేర్చుకోవాలంటూ ఫారం–6 దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.
టీడీపీ నాయకుల బరి తెగింపును ప్రజలు గమనిస్తున్నారు–జాకీర్‌హుసేన్, కౌన్సిలర్, నంద్యాల
యాప్‌ల ద్వారా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలు, బరి తెగింపును ప్రజలు గమనిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల ఓట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫారం–7 ద్వారా తొలగించారనడంలో అర్థం లేదు. మంత్రిగా ఉండి చౌకబారు ప్రచారానికి పూనుకోవడం తగదు.
Comments
Please login to add a commentAdd a comment