బెయిల్ షరతులు సడలించాలన్న సాయిరెడ్డి పిటిషన్‌పై సీబీఐ
విచారణ రేపటికి వాయిదా... జగన్ పిటిషన్‌పై 18న విచారణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరయ్యే పక్షంలో.. హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న ఆయన బెయిల్ షరతులను సడలించినా తమకు అభ్యంతరం లేదని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. కర్ణాటక, తమిళనాడులోని తన ఆడిటింగ్ కార్యాలయాలకు వెళ్లడానికి వీలుగా ఈ నెల 17 నుంచి నవంబర్ 30 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం విచారించా రు.
వృత్తిపరమైన విధులు నిర్వహించేందుకు బెయిల్ షరతులను రెండు పర్యాయాలు ఇదే కోర్టు సడలించిందని సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి నివేదించారు. కోర్టు విధించిన షరతులను ఎప్పుడూ ఉల్లంఘించలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ప్రత్యేక కోర్టును సీబీఐ అభ్యర్థించింది. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.