
ఆర్టీసీకి ‘దసరా’ లేదు!
ఆర్‌టీసీ కార్మికులకు ఏటా ఇచ్చే దసరా అడ్వాన్స్‌ను ఈ ఏడాది రద్దు చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
సాక్షి, హైదరాబాద్: ఆర్‌టీసీ కార్మికులకు ఏటా ఇచ్చే దసరా అడ్వాన్స్‌ను ఈ ఏడాది రద్దు చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ఏడాది కాలంగా ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీల నుంచి రుణాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఈ దసరా పండుగ ఎండగగా మారనుంది. కార్మికులకు దాదాపు ఏడాది కాలంగా ఆర్‌టీసీ సహకార సంఘం నుంచి రుణాలు అందలేదు. నష్టాల్లో ఉన్న యాజమాన్యం రుణాలకు నిధులు అందించకపోవటమే దీనికి కారణం. అదీగాక.. సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె వల్ల కార్మికులకు ఆగస్టు నెల జీతం రాలేదు. సెప్టెంబర్ జీతం కూడా అందే అవకాశం లేదు.
రెండు నెలలుగా జీతాల్లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న సిబ్బందికి ఇప్పుడు దసరా అడ్వాన్స్ రద్దు చేయటం అశనిపాతంగా మారింది. సీమాంధ్రలో సమ్మె కారణంగా సిబ్బందికి జీతాలు ఇవ్వటం, రుణాల మీద వడ్డీలు చెల్లించటానికే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నందున దసరా అడ్వాన్స్ చెల్లించద్దంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న తెలంగాణ సిబ్బందికి కూడా అడ్వాన్స్ చెల్లించకూడదంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్మిక సంఘాలు.. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. యాజమాన్యంపై ఎలాంటి ఆర్థిక భారం పడని అడ్వాన్స్‌ను చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాయి.
కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం
సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్‌లో జరిగింది. అప్పుడు దసరా అడ్వాన్సులు చెల్లించారు. సీమాంధ్రలో సిబ్బంది సమ్మె చేస్తుంటే అడ్వాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించారు. యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. యాజమాన్యం నిరంకుశ ధోరణిని నిరసిస్తూ ఈ నెల 27న భోజన విరామ సమయంలో ధర్నాలు చేపడతాం.
- పద్మాకర్, దామోదరరావు, ప్రసాద్‌రెడ్డి, ఈయూ
26న డిపోలు, యూనిట్ల ఎదుట ధర్నా
ఆర్‌టీసీలో ఉన్న దాదాపు లక్ష మంది హిందూ ఉద్యోగులకు దసరా పండుగ చాలా ముఖ్యమైంది. అడ్వాన్సులు ఇవ్వకపోవటం అన్యాయం. యాజమాన్యం అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈ నెల 26న అన్ని డిపోలు, యూనిట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తాం. - నాగేశ్వరరావు, మహమూద్, ఎన్‌ఎంయూ
అడ్వాన్సులతో సంస్థ మీద భారం పడదు
అడాన్స్‌ను వాయిదాల్లో సిబ్బంది నుంచి రికవరీ చేస్తారు. సంస్థ మీద ఆర్థికంగా భారం పడదు. సెప్టెంబర్ జీతంతో పాటు అడ్వాన్స్ చెల్లించాలి. - వి.ఎస్.రావు, ఎస్‌డబ్ల్యూఎఫ్
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
సమ్మెలో ఉన్న సిబ్బందికి అడ్వాన్స్‌లు ఇవ్వకపోతే సరే. తెలంగాణలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఇవ్వకపోవటం అన్యాయం. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
- చంద్రశేఖర్, ఆర్‌టీసీ సూపర్‌వైజర్ల సంఘం