సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణలోని కార్మికులకు పండుగ అడ్వాన్స్‌లు ఎందుకు ఇవ్వరని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రశ్నించింది.
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణలోని కార్మికులకు పండుగ అడ్వాన్స్‌లు ఎందుకు ఇవ్వరని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రశ్నించింది. గురువారం బస్ భవన్ ముందు టీఎంయూ ఆధ్వర్యంలో పండుగ అడ్వాన్స్, డీఏ తదితర సమస్యలపై కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి ప్రసంగిస్తూ, 30వ తేదీ లోపు దసరా పండుగ అడ్వాన్స్‌లు చెల్లించకపోతే 1 నుంచి సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
కాగా, ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వకపోతే పండుగకు తిప్పాల్సిన ప్రత్యేక బస్సులు నడిపేది లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ హెచ్చరించారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా శుక్రవారం అన్ని డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాస్తామన్నారు. అడ్వాన్స్ చెల్లించకపోతే.. ఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు హెచ్చరించారు. గురువారం ఎన్‌ఎంయూ నిరసనదినం పాటించింది.