సాక్షి, సంగారెడ్డి:
విద్యుత్ చౌర్యంపై ‘నిఘా’ సామాన్యలపైనే కేంద్రీకృతమైంది. ఈ ఏడాది విద్యుత్ శాఖ, విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా దాడులు చేసి భారీ సంఖ్యలో కేసులు నమోదు చేయగా.. అధిక శాతం కేసుల్లో పేద వినియోగదారులే ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన 6,184 విద్యుత్ చౌర్యం కేసుల్లో 5,892 కేసులు గృహలకు సంబంధించినవే ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్ శాఖ ఓ అడుగు ముందుకేసి అరెస్టులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 15 మందిని కటకటాల వెనక్కి పంపగా అందులో అందరూ పేద వినియోగదారులే ఉన్నారు. జిల్లాలో పలు భారీ పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, రైసు మిల్లులు, స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, ఫిల్టర్ ఇసుక క్వారీల యాజమాన్యాలకు కొదవ లేదు. ఈ వినియోగదారులు నిత్యం
భారీగా విద్యుత్‌ను తస్కరిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కేసులు గృహ వినియోగదారులకే పరిమితం చేయడం వెనక మతలబు ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
మామూళ్లు ఇస్తే సరి !
మూడు రకాలుగా విద్యుత్ చౌర్యం జరుగుతోంది. విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ ద్వారా రీడింగ్ వేగాన్ని నియంత్రించడం, మీటర్‌ను బైపాస్ చేసి విద్యుత్‌ను వినియోగించడం, విద్యుత్ లైన్లపై నేరుగా తీగలు వేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కొందరు లైన్‌మెన్‌లు, ఏఈలు పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తూ విద్యుత్ చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇసుక ఫిల్టర్లు, ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లు సైతం విద్యుత్‌ను తస్కరిస్తూ క్షేత్రస్థాయి సిబ్బంది చేతులు బాగానే తడుపుతున్నాయి. గృహ వినియోగదారులతో పోలిస్తే పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం తస్కరిస్తున్న విద్యుత్ పరిమాణం చాలా ఎక్కువే. కానీ, పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ చౌర్యం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని అధికారులు కొట్టి పారేస్తున్నారు.
పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే హెచ్‌టీ లైన్లకు ప్రత్యేక మీటర్లు పెట్టి ప్రతి నెలా ఆ ప్రాంతంలో జరిగిన విద్యుత్ సరఫరా, బిల్లింగ్ మధ్య వ్యత్యాసాన్ని సమీక్షిస్తున్నమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో గృహ వినియోగదారులపై మాత్రమే దృష్టి సారించి భారీగా సంఖ్యలో కేసులు నమోదు చేసిన విద్యుత్ శాఖ.. ఇప్పుడు అరెస్టులు ముమ్మరం చేయడంతో బాధితుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది ఇచ్చే సమాచారం ఆధారంగానే దాడులు జరుపుతున్నామని విజిలెన్స్ విభాగం అధికారులు సమాధానమిస్తున్నారు. నిందితులపై విద్యుత్ చౌర్యం కేసుల నమోదుతో పాటు రూ.1.10 కోట్లకు పైగా జరిమానాలను విద్యుత్ శాఖ విధించింది. దీనికి అదనంగా విజిలెన్స్ విభాగం మరో రూ.47.22 లక్షల జరిమానాలు వేసింది. ఈ జరిమానాలు చెల్లించని పక్షంలో అరెస్టులు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకే అరుస్టులు చేస్తున్నట్లు అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సమాచారమిస్తే ఎవరినీ వదలం
పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ఎవరు విద్యుత్ చౌర్యం చేసినా .. సమచారమిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తాం. ఎవరు విద్యుత్ చౌర్యం చేసినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
- మురళీధర్ రావు, చీఫ్ విజిలెన్స్ అధికారి, విద్యుత్ శాఖ
ఈ ఏడాది కేటగిరీల వారీగా వినియోగదారులపై నమోదైన కేసుల వివరాలు...
కేటగిరీలు.. కేసులు
గృహ 5,892
వ్యాపార 253
పరిశ్రమ 17
వ్యవసాయ 22
మొత్తం 6,184
కాసులిస్తే కేసుల్లేవ్!
Published Thu, Dec 12 2013 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement