విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పక్కన ఎస్పీ రాజకుమారి, డీఆర్వో వెంకటరావు
విజయనగరం: జిల్లాలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదు కాలేదని, మనమంతా సురక్షితంగా ఉండగలిగామని, ఇదే పంథా మరికొన్నాళ్లు కొనసాగించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ బి.రాజకుమారితో కలసి బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడానికి జిల్లాలో 6లక్షల 99 వేల ఇళ్లకు వెళ్లి ఆరు రకాల వివరాలను సేకరించామని చెప్పారు.
విదేశాలు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి వివరాలతో పాటు, వయో వృద్ధులు, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్నవారి వివరాలను సర్వే ద్వారా డేటా సేకరించినట్టు తెలిపారు. జిల్లాలో 919 నమూనాలను సేకరించి, కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపగా ఇంతవరకు 316 నెగిటివ్ వచ్చాయని వివరించారు. మిమ్స్‌తో పాటు మరో 5 ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చి అన్ని వసతులను ఏర్పా టు చేసి, వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్టు వివరించారు.
అందుబాటులో ఆధునిక సౌకర్యాలు
జిల్లాలో 22 వెంటిలేటర్లను, 66 ఐసీయూ, 959 నాన్ ఐసీయూ బెడ్స్‌ను సిద్ధం చేశామనీ,, 382 మంది వైద్యులు, 1186మంది నర్స్‌లు, పారా మెడికల్ సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. వైద్యుల కోసం 3500 పీపీ ఎక్విప్‌మెంట్లు, 4500 ఎన్–95 మాస్‌్కలు, 69 వేల సర్జికల్ మాస్‌్కలు, 9వేల లీటర్ల శానిటైజర్, తదితర సామగ్రి సిద్ధంగా ఉంచామని వివరించారు. జిల్లాలో 1422 గదులలో 4507 బెడ్స్ కెపాసిటీతో 39 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, జేఎన్‌టీయూలో 139 మందిని క్వారంటైన్‌లో ఉంచి 14 రోజులు పూర్తి చేసుకున్న వారిని ఇళ్ళకు పంపించినట్లు తెలిపారు.
వీరికి భోజన, వసతి సౌకర్యాలతో పాటు వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నామని తెలిపారు. ఉపాధి కోల్పోయిన వారికోసం 9 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి 316 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, కందిపప్పు అందించినట్టు తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపరుస్తూ దానిపై ప్రజలకు అవగాహన కలి్పస్తున్నట్టు తెలిపారు.
సరిహద్దుల్లో పటిష్ట నిఘా..
జిల్లాలో ఇతర రాష్ట్ర, జిల్లా సరిహద్దుల నుంచి 40 రూట్లను గుర్తించి రాకపోకలు నిలిపివేశామని, విశాఖపట్నంలో పాజిటివ్ కేసులున్నందున, అక్కడి వారు రాకుండా జిల్లా సరిహదు్దలను మూసివేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారుల అనుమతి తోనే ఎవరైనా కదిలేలా కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేశామన్నారు.
స్వీయ నిర్బంధమే శ్రేయస్కరం: ఎస్పీ
ప్రజల కోసం పోలీసులు రోడ్లపైకి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే ఒక్కరే బయటకు రావాలని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 445 మందిని గుర్తించి వారిని గృహ నిర్బంధంలో ఉంచామని, అందులో 67 మంది చట్టాన్ని ఉల్లంఘించారని కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. లాక్ డౌన్, క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అవగాహన కలి్పస్తూనే, కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. అనుమతి లేని 558 వాహనాలను సీజ్ చేశామని, సమకపాలన పాటించని 435 షాపులపై కేసులు నమోదు చేసి, ఇప్పటివరకూ రూ. ఒక కోటి 15 లక్షలు అపరాధ రుసుంగా వసూలు చేసినట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment