సాక్షి, రామభద్రపురం: సమాజాన్ని కరోనా ఫోబియా వెంటాడుతోంది. కోవిడ్ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా భయంతో జనం వణికిపోతున్నారు. పాజిటివ్ వచ్చినా ఏం కాదని తెలిసినా చాలామంది ఏమవుతుందో అని మనోవేదనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని మొన్ననే కలిశానని, నాకూ రావొచ్చంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పాజిటివ్ వ్యక్తికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, కనిపించకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. చాలా మంది ఆ ప్రయత్నం చేయకుండానే ఏమవుతుందోనని కుమిలిపోతున్నారు.
కొందరు నెగెటివ్ ఆలోచనలతో కుంగిపోతున్నారు. తనకేమైనా జరుగుతుందేమోనని మనోవేదనకు గురవుతున్నారు. తమ కళ్ల ముందరే పలానా వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని, ఆయన ఆస్పత్రుల్లో అనేక కష్టాలు పడ్డాడని, ఫలానా వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడని ఇలా ఇవేవో ఊహించుకుంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వేలాది మంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొంది కోలుకుంటున్నారు. వీటిని గుర్తించకుండా.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని వీడియోలు, ఉదంతాలను చూసి తమకు కరోనా వస్తే అలాంటి కష్టాలు పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. వయసు మళ్లిన వారు సైతం కోలుకుంటున్న పరిస్ధితుల్లో అనవసర ఆందోళనలకు గురికావద్దని వైద్యులు చెబుతున్నా వినిపించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దగ్గినా, తుమ్మినా అనుమానమే..
వర్షాకాలం సీజన్ కావడంతో వర్షంలో నానినా, ప్రయాణాలు చేసినా సాధారణంగా చాలామందికి జలుబు చేయడం, దగ్గు, తుమ్ములు రావడం సహజం. దీనికి తోడు వైరల్ ఫీవర్‌లతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ అనేది మహమ్మారి అనే భావన అందరి మనసుళ్లలో నిండిపోవడంతో దగ్గినా, తుమ్మినా కరోనా కావచ్చనుకుంటున్నారు. తమకు తాముగాను అనుమానించుకుంటున్నారు. దానికి తోడు ఇరుగు పొరుగు వారు కూడా ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూస్తుండడం కూడా వారిని ఇబ్బంది పెడుతోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులను కూడా అనుమానిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మొదట్లో లక్షణాలు ఉన్నవారికే చేసేవారు. ఇప్పుడు అందరికీ చేస్తున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా బెదిరిపోవల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లోనే ఉండి మందులు వాడితే గట్టెక్కవచ్చు. అనవసరంగా ఆందోళనకు గురై మరిన్ని కష్టాల్లో కూరుకుపోవద్దని వైద్యులు అంటున్నారు.
ఆందోళన చెందొద్దు:
మన ప్రాంతంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ అంత శక్తి వంతమైనది కాదు. అలాగే, ఉధృతి కూడా తగ్గింది. కరోనా సోకినా ధైర్యంగా హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదు. కరోనా సోకిన వ్యక్తికి వయసు 55 ఏళ్లు పైబడి, శరీరంలో ముందుగా ఊపిరితిత్తులకు సంబంధించి ఏవైనా వ్యాధులు ఉంటే కొద్దోగొప్పో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాంటి వారు కూడా ధైర్యంగా.. ఆందోళన చెందకుండా ఉంటే కోలుకోవచ్చు. వర్షాకాలం సీజన్ కావడంతో జలుబు చేయడం, దగ్గు, తుమ్ములు రావడం సహజం. ప్రతీ జ్వరాన్ని కరోనా అన్న అనుమానం ఉండకూడదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దగ్గినా తుమ్మినా కరోనా కావచ్చని అనుమానిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకుని అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. – వై.విజయమోహన్, కోవిడ్ ప్రొగ్రాం ఆఫీసర్, బొబ్బిలి నియోజకవర్గం
ఇంట్లోనే మందులు వాడాను..
నేను కరోనా బారిన పడ్డాను. ఏ మాత్రం అధైర్యపడకుండా ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడి కోలుకున్నాను. కరోనా సోకిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయపడితే మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కరోనా సోకినా ధైర్యంగా ఉండి మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదన్నందుకు నేనే నిదర్శనం. – గొర్లి అప్పలనాయుడు, రామభద్రపురం
Comments
Please login to add a commentAdd a comment