సత్తెనపల్లిరూరల్,న్యూస్‌లైన్: అట్టహాసంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం పత్తి లేక వెలవెల బోతోంది. పత్తి రైతును ఆదుకుంటామని , గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతూ సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ నెల 16న పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మద్దతు ధరగా క్వింటాకు రూ. 4 వేలు ప్రకటించారు. సవాలక్ష నిబంధనల పేరిట కనీస ధరగా రూ. 3200 నుంచి ఆరంభించారు. సత్తెనపల్లి డివిజన్ పరిధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో సుమారు 25 వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. సత్తెనపల్లి సీసీఐ కేంద్రంలో ముప్పాళ్ల, సత్తెనపల్లి, పెదకూరపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన రైతులు పత్తిని అమ్ముకొనే అవకాశం ఉంది.
నష్టమే అధికం....
ఆయా గ్రామాల్లోని రైతులు సీసీఐ కేంద్రం వల్ల లాభం కంటే నష్టమే అధికంగా ఉందని వాపోతున్నారు. పత్తిని బోరాలకు తొక్కి లారీకి ఎత్తటానికి క్వింటాకు రూ. 40 లు, వాటిని సీసీఐ కేంద్రానికి తరలించటానికి కనీసం రూ.1000 లు బాడిగ లేనిది ఏ వాహనం రాదు. తర్వాత వాహనంలోంచి దించటానికి సీసీఐ కేంద్రంలోని కూలీలు బోరానికి రూ.30 తీసుకుంటారు. ఈ ఖర్చులన్నీ పోను క్వింటాకు రైతుకు గాను రూ. 3200 నుంచిరూ. 3600 మాత్రమే లభిస్తున్నాయి. పైగా అమ్మిన పత్తికి బిల్లులు కూడా దాదాపు 15 రోజులు వరకు రావడంలేదు.
ఇన్ని వ్యయప్రయాసలకోర్చి తీసుకువస్తే సీసీఐ కేంద్రంలో నాణ్యత, తేమ పేరుతో క్వింటాకు ఎంత తగ్గిస్తారో తెలియని అయోమయ పరిస్థితి. తేమ శాతం 11 ఉంద ని , కొనలేమని బయ్యర్ చెబితే దానిని తిరిగి ఇంటికి తీసుకెళ్లటం అదనపు భారం. ఇన్ని ఖర్చులు భరించేందుకు సిద్ధంగా లేమని రైతులు గట్టిగా చెబుతున్నారు. దానిక ంటే బహిరంగ మార్కెట్‌లోనే గిట్టుబాటు ధర లబిస్తుందని చెబుతున్నారు. వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి క్వింటాకు రూ. 3800 నుంచి రూ. 4000 వరకు చెల్లించి తీసుకువెళుతున్నారని చెబుతున్నారు.సీసీఐతో పోల్చుకుంటే ఇదే లాభసాటిగా ఉందంటున్నారు.
కొనుగోళ్లు ఒకరోజుతోనే సరి...
సీసీఐ కేంద్రం ప్రారంభించి నేటికి 15 రోజులు కావస్తున్నా కొనుగోలు చేసింది కేవలం 1133 క్వింటాళ్లు మాత్రమే.
ఇవి కూడా ప్రారంభించిన రోజు కొనుగోళ్లు. అప్పటి నుంచి క్వింటా కూడా కొనుగోలు చేయలేదు. గత వారంలో విజిలెన్స్ అధికారులు సీసీఐ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడి లోపాలను గుర్తించి రైతుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. భద్రతా చర్యలు, గిట్టుబాటు ధరపై న విచారణ జరిపారు. గిట్టుబాటు ధర సరిపోదని, తేమ శాతం పేరుతో తిరస్కరించటం సరికాదని కొంతమంది రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. వర్షాలకు తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనకుంటే ఎవరు కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సీసీఐ కేంద్రాల పనితీరు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
బేరాల్లేని సీసీఐ
Published Tue, Dec 31 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement