ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలపైనే కనిపిస్తున్నా..వాస్తవంగా ఆ రేటు వారికి అందటం లేదు. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం లేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీసీఐ ఇప్పటి వరకు కేవలం రెండు కేంద్రాలనే తెరవడంతో దళారుల పంట పండుతోంది.
పత్తి పంట అక్టోబర్ నెల ప్రారంభం నుంచి మార్కెట్‌కు అమ్మకానికి వస్తుంది. ప్రభుత్వం పత్తి అమ్మకానికి వచ్చే సమయం నుంచే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో అక్టోబర్ 3, 4 వారాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. అక్టోబర్ 17న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రెండు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అయితే సీసీఐ అధికారులు 17వ తేదీన మార్కెట్‌కు వచ్చినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్కెట్‌ను సందర్శించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించలేదని చెప్పడంతో ఎంపీ అక్కడి నుంచే ఆ శాఖకు సంబంధించిన చీఫ్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
స్పందించిన సీసీఐ అదేనెల 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది. జిల్లాలో ఒక్క నేలకొండపల్లిలో నవంబర్ 3వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది మినహా జిల్లాలో మిగతా ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులదే ఇష్టారాజ్యమైంది.
తేమ పేరుతో తిరస్కరణ
సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. అసలే శీతాకాలం కావడం, మార్కెట్‌కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకు వస్తుండటంతో మంచు కారణంగా తేమశాతం పెరుగుతోంది. దీన్ని అడ్డుపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకు కొనుగోలుకు విముఖత తెలుపుతోంది.
పత్తి అమ్మకానికి తెచ్చే రైతులు భూ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలనే నిబంధన కూడా రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. అనేకమంది రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరు పత్తిని సాగుచేసినట్లుగా వీఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావడం ఇబ్బందికరంగా మారింది. ఈ పత్రం ఉంటేనే మార్కెట్ లోకి పత్తిని అనుమతిస్తున్నారు. అనేకమంది రైతులకు వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎలాగోలా పత్తిని అమ్మిన రైతులకు చెక్‌లు వెంటనే ఇవ్వడం లేదు. పత్తిని అమ్మిన 15 రోజుల తర్వాత కానీ చెక్‌లు రావడం లేదు.
దళారుల పన్నాగం..
సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. తేమశాతం, డబ్బు చెల్లింపుల్లో 15 రోజుల వ్యవధి తదితర ఇబ్బందులు సీసీఐలో చోటు చేసుకోవడంతో వీటిని ఆసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు.
అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావించి పొరుగు జిల్లాలకు చెందిన కొందరు దళారులు లారీల్లో పత్తిని తీసుకువచ్చి అమ్మకానికి ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. దీన్ని అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. ఇలా సీసీఐకి ఎక్కువ మొత్తంలో దళారులే పత్తిని అమ్ముకుంటుండగా నిజమైన రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ కొద్దిరోజుల క్రితం బయ్యర్లనూ మార్చింది. నూతనంగా వచ్చిన బయ్యర్లు తేమశాతం ఏమాత్రం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుండటంతో రైతులూ ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఫలితమివ్వని చర్యలు
సీసీఐ కేంద్రంలో అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వశాఖలు చర్యలకు పూనుకున్నాయి. దళారులకు సంబంధించిన పత్తిని సీసీఐకి విక్రయిస్తుండగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై మార్కెట్‌లోని కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. రైతులే సీసీఐ కేంద్రంలో అమ్ముకుంటుంటే అనవసరంగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బుధవారం మార్కెట్‌కు వచ్చిన వివిధ పంట ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేశారు. కొందరు వ్యాపారులు రైతులను సీసీఐ అధికారులపైకి ఉసిగొల్పుతున్నారని సమాచారం.
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
జిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి మినహా ఎక్కడా సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పండించిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధరగా నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మిగతా చోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.3,500ల చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది.
ఖమ్మంలో సీసీఐ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు కేవలం 55,345 క్వింటాలు, నేలకొండపల్లి సీసీఐ కేంద్రంలో 1,657 క్వింటాలను మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు ప్రస్తుత సీజన్‌లో దాదాపు 2.50లక్షల క్వింటాలుకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. ఇంకా మధిర, ఏన్కూరు, భధ్రాచలం, వైరా, బూర్గంపాడు, కొత్తగూడెం, చండ్రుగొండలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఛీసీఐని‘బంధనాలు’
Published Thu, Nov 13 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement