ముడిదాం–రీమాపేట వద్ద డివైడర్ లేని జాతీయ రహదారి
సాక్షి, విజయనగరం రూరల్ : మండలంలోని చెల్లూరు–ముడిదాం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా డివైడర్లు లేక ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని చెల్లూరు నుంచి ముడిదాం, రీమాపేట గ్రామాల మీదుగా వీటీ అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్లు లేకపోవడంతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకోవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఒడిశాకు రోజూ వేలాది వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలే జాతీయ రహదారి, పట్టణ శివారు కావడం రోడ్డు చిన్నదైనా వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం నెలకోసారైనా మూడు కిలోమీటర్ల రోడ్డులో ఎక్కడోచోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండే విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించడంతో తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను పాఠశాలలకు సాగనంపుతున్నారు. పాలకులు, ఆర్ ఆండ్ బి అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ మంజూరు చేసి నిర్మించాలని ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ ప్రజలు కోరుతున్నారు.
భయమేస్తోంది
రోడ్డు ఇరుగ్గా ఉండటం, భారీ వాహనాలు, కార్లు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయమేస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటాలంటే మనిషి తోటు ఉండాల్సిందే.
– తుపాకుల అప్పలరాజు, ప్రశాంతినగర్
డివైడర్లు ఏర్పాటు చేయాలి
ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. ప్రశాంతినగర్ వద్ద భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డుకు ఇరుకుగా ఉండటం, వాహనాలు అతివేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
– అలమండ అప్పలరాజు, మాజీ సర్పంచ్, ముడిదాం
Comments
Please login to add a commentAdd a comment