
'జగన్, కేసీఆర్ కలిసినట్టు మా వద్ద ఆధారాల్లేవు'
చిత్తూరు: రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి మాట్లాడుకున్నట్టు తాము చెప్పలేదని.. వాటికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా లేవని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కొన్ని టీవీలు, వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయని అందుకే తాము మాట్లాడామని సమర్థించుకున్నారు.
అంతే తప్ప.. జగన్, కేసీఆర్ కలిసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని గాలి అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో 140 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. దీనిపై ఓ నివేదికను కేంద్రానికి పంపించామని తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని 150 సంస్థలపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు హక్కు లేదని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ చెప్పడం దారుణం అని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.