బిల్లు పెట్టే వరకూ కాంగ్రెస్‌ను నమ్మలేం: కేటీఆర్
సిరిసిల్ల, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చి తీరాల్సిన అనివార్యత కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, తెలంగాణ ప్రకటించి 56 రోజులైనా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందన్నారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల నోట్లకట్టలకు తెలంగాణ నోట్ ఆగిపోతుందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడితే నలభైవేల మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని, కృష్ణా, గోదావరి నీళ్లు రావని చెబుతున్న అశోక్ ఇన్నాళ్లూ తెలంగాణకు జరిగిన అన్యాయం ఏమిటో గుర్తించాలని కేటీఆర్ కోరారు. పదమూడేళ్లుగా నీళ్లు, నిధుల వివక్షపై టీఆర్‌ఎస్ చెబుతున్నవన్నీ అక్షర సత్యాలని సీమాంధ్ర నేతలే ఇప్పుడు చెబుతున్నారని వివరించారు.
అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో తెలంగాణకు అనుకూలంగా స్పష్టం చేశాయని, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలనే పట్టించుకోకుండా సీమాం ధ్రబాట పట్టాయని ధ్వజమెత్తారు. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తెలంగాణ, సీమాంధ్ర పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీల చిత్తశుద్ధిని ప్రజలే ఎండగడతారన్నారు. 29న సకలజనుల భేరి ద్వారా తెలంగాణ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.