జగన్ ప్రభంజనాన్నిఎవరూ ఆపలేరు: మేకపాటి
కడప : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ప్రయోజనం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని.. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కడపలో సమైక్యాంధ్ర కోసం ఐదురోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డిలకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ పాలకులు మాత్రం విభజించు పాలించు అనే థోరణిలో ఆలోచిస్తున్నారని మేకపాటి మండిపడ్డారు.
కాంగ్రెస్ చక్రబంధంలో చంద్రబాబు చిక్కుకున్నారని.. అందుకే ఆయన తెలంగాణకు మద్దతు పలికారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని మేకపాటి రాజమోహన్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరన్నారు. వైఎస్ జగన్ను దెబ్బతీసేందుకే విభజనకు కాంగ్రెస్ పూనుకుందన్నారు. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని మేకపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై బాబు రెండుకళ్ళ సిద్దాంతాన్ని పాటిస్తున్నారని అన్నారు.
సోనియా పుత్రోత్సహామే రాష్ట్ర విభజన చిచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మనసులో సమైక్యమే ఉన్నా కాంగ్రెస్తో జతకట్టారని ఆయన వ్యాఖ్యానించారు.