చంద్రబాబు మహా ద్రోహి: ఎంపీ మేకపాటి
కావలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహాద్రోహి అని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌లో భాగంగా జెండా చెట్టు సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబును తిట్టేందుకు తెలుగులో పదాలు కూడా లేవని, ఆయన తెలుగు చరిత్రలో మచ్చగల నేతగా నిలిచిపోతారని చెప్పారు. చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఇంట్లో ఉండాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖతో కాంగ్రెస్ రాష్ర్ట విభ జన నిర్ణయం తీసుకుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక రాష్ట్ర విభజనను ముందుకు తెచ్చారన్నారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని విభజించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే పది ఎంపీ సీట్ల కోసం ఈ విభజనను అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు. ఎన్నో తప్పులు చేసిన చంద్రబాబు తన పరిస్థితి ఏమవుతుందోననే భయంతో కాంగ్రెస్ చెప్పినట్టు నడుచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి, గూడూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.