సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘జిల్లా ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తాం. జిల్లాకు మూడు కోట్లు రూపాయలు సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేశారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రజల దాహార్తిని తీర్చుతాం.’ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని ఈ నెల 19న విడుదల చేసిన ప్రకటన సారాంశమిది. సీఎం చంద్రబాబునాయుడైతే అంతకు వారం ముందే అర్బాటంగా దీనిపై ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన దాఖలాల్లేవు. సీఎం ప్రకటనను స్ఫూర్తిగా తీసుకుని కొందరు తహసీల్దార్లు తమకున్న వనరులు, స్పాన్సర్ల ద్వారా ఒక రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఇలాగే వేసవి కాలమంతా మజ్జిగ పంపిణీ చేస్తారని అంతా భావించారు.
కానీ ఇంతవరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3కోట్లు రాలేదు. మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ ప్రారంభం కాలేదు. కనీసం దీనిపై ఉత్తర్వులైనా రాలేదు. ఏ అధికారిని అడిగినా తమకే సమాచారం లేదంటూ దాట వేస్తున్నారు. సాధారణంగా విపత్తుల నివారణ పర్యవేక్షక బాధ్యతలు తీసుకునే కలెక్టరేట్‌లోని డీ సెక్షన్‌కు ఉత్తర్వులు రావల్సింది. వచ్చిన ఉత్తర్వులను జిల్లా రెవెన్యూ అధికారి అమలు చేయాల్సి ఉంది. కానీ, వారికింతవరకు ఉత్తర్వులు రాకపోవడంతో తమకేమి తెలియదన్నట్టుగా చెబుతున్నారు.
రోడ్డుపైకొస్తే దాహం... దాహం...
ఒకవైపు బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటికొస్తే నోరు ఆరిపోతోంది. నాలుకు పిడచకట్టుకు పోతోంది. పైసలున్నోళ్లయితే ఏవో డ్రింకులతో సేదతీరుతారు. మరి నిరుపేదలు ఎదురు చూసేది రోడ్డు పక్కననున్న చలివేంద్రాల కోసమే. జిల్లాకు రూ. 3కోట్లు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన ప్రకటన చూసి ఎక్కడికక్కడ మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు దొరుకుతాయని, రోడ్డెక్కితే ఇబ్బందులుండవని భావించారు. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఎక్కడా పంపిణీ జరగడం లేదు.
ఉత్తుత్తి ప్రకటనలేనా?
అసలు జిల్లాకు కేటాయించిన రూ. 3కోట్లు వచ్చాయా? వస్తే ఏమయ్యాయి? ఇప్పుడీ ప్రశ్నే తలెత్తుతోంది. ఎన్నికల హామీల మాదిరిగా రూ. 3కోట్లు మజ్జిగ ప్రకటన కూడా ఉత్తుత్తిదేనా అన్న అనుమానమూ కలుగుతోంది. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఉచిత మజ్జిగ విషయమై తమకింతవరకు ఉత్తర్వులు రాలేదన్నారు.
వడదెబ్బ మృతుల కుటుంబాలకూ అందని సాయం
వడదెబ్బ మృతుల కుటుంబాలకూ ఇంకా సాయం అందలేదు. సోమవారం నాటికి జిల్లాలో 45మంది మృతి చెందారు. అందులో ఒక్కరి కుటుంబానికైనా అందలేదు. కనీసం మృతులపై నివేదికలే రప్పించుకోలేదు. స్థానికులిచ్చే సమాచారాన్ని రెవెన్యూ అధికారులు కలెక్టరేట్‌కు చేరవేయడం తప్ప పరిశీలన చేసిన దాఖలాలు కన్పించడం లేదు. దీనికంతటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది.
ఏదీ ఉచిత మజ్జిగ?
Published Wed, Apr 27 2016 12:29 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement