గాలొచ్చినా.. వానొచ్చినా.. చిమ్మ చీకటే ! | No light facility! | Sakshi
Sakshi News home page

గాలొచ్చినా.. వానొచ్చినా.. చిమ్మ చీకటే !

Published Thu, Jun 12 2014 12:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

గాలొచ్చినా.. వానొచ్చినా.. చిమ్మ చీకటే ! - Sakshi

గాలొచ్చినా.. వానొచ్చినా.. చిమ్మ చీకటే !

సాక్షి, అనంతపురం : చిరుగాలులకే చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇక ఈదురుగాలులు వీస్తే జిల్లా అంతటా అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. ఏటా రుతుపవనాల రాకకు ముందు చేపట్టాల్సిన చర్యలు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఇటు విద్యుత్ సంస్థ, అటు వినియోగదారులు నష్టపోతున్నారు.
 
 తూతూమంత్రంగా పీఎంఐ
 ప్రతియేటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో విద్యుత్ శాఖ అధికారులు ప్రీ మాన్‌సూన్ ఇన్‌స్పెక్షన్ (పీఎంఐ) నిర్వహించాల్సి ఉంటుంది. రుతు పవనాలు, గాలి దుమారాలు రాక ముందే విద్యుత్ లైన్లను పటిష్టపరచాలి. 11 కేవీ, 33 కేవీ, ఎల్టీ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలి. చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర చిన్నపనులకు గాను ప్రభుత్వం ఒక్కో సెక్షన్ అధికారికి నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు మంజూరు చేస్తోంది. ఇదే విధంగా ఏఈ, ఏడీఈలకు కూడా మంజూరు చేస్తోంది. ఈ మొత్తాన్ని చాలా మంది నొక్కేస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఫీడర్లు ఉంటాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 11 కేవీ లైన్లు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటాయి.
 
 వీటి నిర్వహణకు ఈ నిధులు ఏమాత్రమూ చాలడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. చాలామంది పనులు చేయించకుండానే నిధులు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామీణ  ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకటీ అరా సబ్‌స్టేషన్ల పరిధిలో తప్ప మిగతా చోట్ల ఏడీఈలు, ఏఈలు... పీఎంఐని విస్మరించడంతో  తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఒక్కో సెక్షన్ అధికారి పరిధిలో మూడు నుంచి నాలుగు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. దీనివల్ల పర్యవేక్షణ కూడా భారంగా మారింది.
 
 లూజులైన్లతో సమస్యలు
 నిబంధనల ప్రకారం 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లకు ఒక స్తంభానికి మరో స్తంభానికి మధ్య దూరం 50 నుంచి 60 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం 90 నుంచి 100 మీటర్లు ఉంటోంది. దీంతో తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదంగా మారాయి. చిన్న గాలులు వచ్చినా తెగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం గుంతకల్లు, విడపనకల్లు, కొత్తచెరువు, హిందూపురం ప్రాంతాల్లో గాలీవానకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. గుంతకల్లులోని అబ్బేకాలనీలో ఎల్టీ లైనుకు సంబంధించి రెండు స్తంభాలు విరిగిపడ్డాయి, విడపనకల్లు వద్ద 33 కేవీ లైన్లకు సంబంధించి ఐదు స్తంభాలు నేలకూలాయి. కొత్తచెరువులో విద్యుత్ స్తంభంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. హిందూపురం వద్ద విద్యుత్‌స్తంభాలు, తీగలు తెగిపడి ఒక రోజంతా గ్రామాలు అంధకారంలో మగ్గాయి. బుధవారం  కనగానపల్లి మండలం మామిళ్లపల్లి బీసీ కాలనీలో 11 కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో ఇళ్లలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. కాలనీవాసులు బెంబే లెత్తిపోయారు. కరెంటు స్తంభాలు  నాణ్యత లేకపోవటంతో గాలి దుమారాలకు దెబ్బతింటున్నాయి. దీనివల్ల విద్యుత్ సంస్థ రూ.లక్షల్లో నష్టపోతోంది.   
 
 విద్యుత్ స్తంభం ఎక్కేవారేరీ?
 విద్యుత్ లైన్లలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు స్తంభం ఎక్కేవారు కరువయ్యారు. ఇన్సులేటర్లు, డిస్కులు మార్చాలన్నా, కండక్టర్లు చుట్టాలన్నా సిబ్బంది ఉండటం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పనులు చేస్తున్నారు. చాలామంది హెల్పర్లు, లైన్‌మెన్లు, అసిస్టెంట్ లైన్‌మెన్లు స్తంభాలు ఎక్కలేకపోతున్నారు.  ప్రయివేటు వ్యక్తులతో ఈ పనులు చేయిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినపుడు ప్రైయివేటు వ్యక్తులు బలవుతున్నారు. దీనికి తోడు విద్యుత్ సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది.
 
 చర్యలు తీసుకుంటున్నాం         
 మార్చి, ఏప్రిల్ మాసాల్లో తలెత్తే విద్యుత్ సమస్యలను పరిష్కరించే విషయమై ఒక్కో సెక్షన్ ఆఫీసర్, ఏఈ, ఏడీఈలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల చొప్పున మంజూరు చేస్తాం. ఏ నెల మొత్తం ఆ నెల క్లోజ్ చేసిన తరువాతే మరుసటి మాసానికి మంజూరు చేస్తాం. ఈ ఏడాదికి సంబంధించి నిధులు ఇంకా మంజూరు కాలేదు. చిరుగాలులకే విద్యుత్ అంతరాయాలు వస్తుండడంపై చర్యలు తీసుకుంటున్నాం.
 - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement