మైదుకూరు,న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అమ్మహస్తం పథకం’పై నిరసన వ్యక్తమవుతోంది. నాణ్యత లేని సరుకులు అంటగడుతున్నారని మైదుకూరులో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు పట్టణంలోని పాతూరుకు చెందిన పలువురు మహిళలు సోమవారం అమ్మహస్తం పథక వస్తువులను పారవేశారు. ఇలా ఒకవైపు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు అమ్మహస్తం పథకం అమలు చేస్తున్న చౌకడిపో డీలర్లు నాణ్యతలేని వస్తువులపై తహశీల్దారు వెంకటరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. పథక వస్తువుల కొనుగోలుకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని.. తీరా వస్తువులు కొన్నా వాటిని తీసుకునేందుకు కార్డుదారులు విముఖత చూపుతున్నారని వాపోయారు.
అమ్మహస్తం పథకం నిర్వాహణ కష్టంతో కూడుకున్నదని.. తొమ్మిది వస్తువుల్లో పసుపు, చింతపండు,కారం, గోధుమపిండి తదితర వస్తువులు వినియోగదారులు తీసుకెళ్లడం లేదని.. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నామని డీలర్లు తమ గోడు తహశీల్దారుకు విన్నవించుకున్నారు. పథకానికి చెందిన తొమ్మిదివస్తువులు తప్పని సరిగా కొనుగోలు చేస్తేనే.. రూపాయి బియ్యం ఇస్తామని డీలర్లు చెపుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాతూరుకు చెందిన మహిళలు అమ్మహస్తం పథక వస్తువులను నిరాకరిస్తున్నారు. చింతపండు నల్లగా ఉందని, గోధుమ పిండిలో పురుగులు ఉంటున్నాయని. కారంలో మంట లేదని, పసుపు పనికిరాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వస్తువులు అంటిగట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దోపిడి చేస్తున్నారని.. ఈ వస్తువులు తింటే మా ఆరోగ్యం ఏమి కావాలంటూ మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అమ్మహస్తం పథకం సరుకులు మాకొద్దని.. బియ్యం మాత్రమే చాలని వారంటున్నారు.
‘అమ్మహస్తం’ సరుకులు మాకొద్దు..!
Published Tue, Aug 6 2013 4:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement