
సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని.. అప్పటికీ కాపు రిజర్వేషన్లు అమలుకాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పదర్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కాపు జేఏసీ కార్యాచరణ సదస్సుకు 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు, ఉద్యమనేత ముద్రగడ పాల్గొన్నారు. కాపు జేఏసీ సదస్సులో ముద్రగడ పలు అంశాలను ప్రస్తావించారు.
'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది నా ఆశ. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందాలంటే రిజర్వేషన్నది కచ్చితంగా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గించకూడదని మనవి చేస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది ప్రధాన డిమాండ్. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదు. ఉద్యోగ, ఇతర రంగాలతో పాటు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలి. అలా జరిగితే అందరికీ సమాన అవకాశాలుంటాయని' కాపు నేత ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు.