చానళ్ల ప్రసారాలు కావాలనే ఆపేశాం
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా చానళ్లను కావాలనే నియంత్రించామని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు ప్రజల మద్దతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపులు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా బంద్ విఫలమైందని, పోలీసులు ఆ బంద్‌ను విజయవంతం కానివ్వరని చెప్పారు. రేపటి బంద్‌ను కూడా విఫలం చేస్తామన్నారు.
ఇదే సమయంలో సాక్షి టీవీ ప్రసారాలను ఎందుకు ఆపేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొన్ని చానళ్లను కావాలనే నియంత్రించామని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే తాము నియంత్రించినట్లు ఆయన స్వయంగా చెప్పారు. ముద్రగడ దీక్ష కొనసాగేవరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని పరోక్షంగా చెప్పారు. దీక్షకు మద్దతు ఇస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనే వాటిని ఆపేశామన్నారు.