ఓ అధికారిని బదిలీ చేస్తే.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం విస్మయం కలిగిస్తోందని ఎన్నికల సంఘం పేర్కొంది. బదిలీ ఎందుకు చేశారో కారణాలు చెప్పాల్సిన అవసరం ఈసీకి లేదని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చిచెప్పింది. అధికార తెలుగుదేశం పార్టీ సేవలో తరిస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఏకపక్షంగా ప్రకటించి, ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కార్యదర్శి శ్రీకాంత్ ఈ పిటిషన్ వేశారు. తామిచ్చిన ఫిర్యాదు మేరకే ఏబీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీలను ఈసీ విధుల నుంచి తప్పించిందని, అందువల్ల ఈ వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పైవిధంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించనుంది. – సాక్షి, అమరావతి
ఈసీ వాదనిదీ..
►ఓ అధికారి బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడమేంటి?
► అభ్యంతరం ఉంటే సంబంధిత అధికారే పిటిషన్ దాఖలు చేయాలి.
►బదిలీపై కారణాలు చెప్పక్కర్లేదు.. ఒక వేళ చెబితే అధికారికే ఇబ్బంది.
► స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈసీకి ఉంది.
► ఇంటెలిజెన్స్ డీజీతోపాటు ఎస్పీలది బదిలీ కిందకు రాదు. వారిని ఎన్నికల విధుల నుంచి మాత్రమే తప్పించాం.
► ఈసీ ఉత్తర్వుల తర్వాతే ఏపీ ప్రభుత్వం డీజీని రిలీవ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు ఎస్పీలకే బదిలీ ఉత్తర్వులిచ్చింది.
► ఎన్నికల్లో ఇంటెలిజెన్స్‌ది కీలకపాత్ర. అలాంటిది ఇంటెలిజెన్స్ విభాగానికి ఎన్నికల విధులతో సంబంధం లేదంటే ఎలా?
► డీజీపీనే ఎన్నికల విధుల్లో భాగమైనప్పుడు, ఆయన కింద పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం ఎన్నికల విధుల్లో భాగం కాదా?
– ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి
ప్రభుత్వ వాదనిదీ..
►ఎన్నికల విధులతో ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధం లేదు.
►ఇంటెలిజెన్స్ డీజీ, ఇద్దరు ఎస్పీల బదిలీకి కారణాలు చెప్పలేదు. ఇది ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే.
►ఎన్నికల విధుల పరిధిలోకి ఎవరు వస్తారో ప్రజాప్రాతి నిధ్య చట్టంలోని సెక్షన్ 28(ఏ)లో స్పష్టంగా ఉంది. ఈసీ దానికి పరిమితమై వ్యవహరించాల్సి ఉంటుంది.
►ఎన్నికల విధుల్లో భాగమైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకుంది. అదే సమయంలో ఎన్నికల విధుల్లో భాగం కానివారి విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.
►ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కారణాలు చెప్పి తీరాలి.
►ఈసీ ఆదేశాల్ని అమలు చేస్తాం. అయితే మా అధికారాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు.
►ఈ మొత్తం వ్యవహారం ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇందులో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.
– ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్
వైఎస్సార్‌సీపీ చెప్పిందిదీ..
►మా పార్టీ ఫిర్యాదు మేరకు వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత మాకుంది.
►అధికారపార్టీ అక్రమాలపై ఫిర్యాదు చేసే అధికారం ప్రతిపక్ష పార్టీగా మాకుంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈసీ చర్యలు తీసుకోవచ్చు.
► వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకుం దని స్వయంగా సీఎం చెబుతున్నప్పుడు, ఈ వ్యవహా రంలో జోక్యం చేసుకునే అర్హత మాకు లేదంటే ఎలా?
► వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఫిర్యాదు మేరకు అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను ఈసీ బదిలీ చేసింది. దానిపై అప్పటి ప్రభుత్వం రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం రచ్చ చేస్తోంది.
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికల విధుల్లో భాగం. ఈ పిటిషన్ దాఖలు చేయడంద్వారా ఆయన ఈసీని సవాలు చేసినట్లయింది. ఇందుకుగాను ఆయనపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.
– వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment