సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ తొత్తుగా పనిచేస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తప్పిస్తేనే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్‌కు వైఎస్సార్‌సీపీ విన్నవించింది. టీడీపీకి సహకరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై తాము పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలిపింది. తాము చేసిన ఫిర్యాదుల్లో సింహభాగాన్ని ఈసీ ఆమోదించలేదని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో కూడిన ఫుల్ బెంచ్‌తో భేటీ అయ్యారు. అధికార పార్టీకి సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకొనే విషయంలో తాము చేసిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదని, దీనిపై పునరాలోచన చేయాల్సిందిగా నేతలు విజ్ఞప్తి చేశారు. తాము చేసిన ఫిర్యాదుల్లో ప్రధానంగా రాష్ట్ర డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్, శాంతిభద్రతల డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, దామోదర్, ప్రకాశం జిల్లా కలెక్టర్, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్నారు.
రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారు..
ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను నిలుపుదల చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించారని సమావేశం అనంతరం మీడియాతో మాట్లా డుతూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కాదన్న తీరుగా ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలనే బేఖాతరు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పలువురు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలపై ఆదేశాలు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్, డీజీపీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు నలుగురు సమావేశమై చర్చించుకొని.. ఈసీ ఆదేశాలు నిలుపుదల చేస్తూ జీవో జారీ చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్న డీజీపీ ఇటీవల తన కారులో రూ.35 కోట్ల డబ్బును అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్‌కు ఫిర్యాదు చేసినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.
చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనం..
దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో అనైతిక పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో జనసేన, ప్రజాశాంతి పార్టీలతో అనైతిక పొత్తు పెట్టుకొని వైఎస్సార్ సీపీ ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
మా అభ్యర్థుల పేర్లను పోలిన వారినే పోటీకి దింపారు..
చంద్రబాబు, కేఏ పాల్ కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చే కుట్ర పన్నారని ఈసీ ఫుల్ బెంచ్‌కు వివరించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే 35 అసెంబ్లీ, 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నిలబెట్టిన అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వారినే ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీకి దింపారని, చంద్రబాబు డబ్బుకు అమ్ముడుపోయిన కేఏ పాల్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. దీన్ని అడ్డుకొనేందుకు వెంటనే ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును రద్దు చేయాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment