
సాక్షి, అమరావతి: డీజీపీ ఆర్.పి.ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీగా కొనసాగితే సామాన్యులు సజావుగా ఓటు హక్కును వినియోగించుకోలేరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలయ్యే వరకు ఠాకూర్‌ను డీజీపీ విధుల నుంచి తప్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో దివ్వేదిని కలిసి పలు ఆధారాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. హైదరాబాద్‌లో ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయన్ని డీజీపీగా సీఎం నియమించారని, ఈ పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఇది ఆ పార్టీ సానుభూతిపరులే ప్రచారం కోసం చేశారంటూ ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఠాకూర్ హయాంలో ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, ఎన్నికలయ్యేంత వరకు ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్నారు.
నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఖాకీలు..: కాగా, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా విధుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారులపై అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం ద్వివేదికి ఫిర్యాదు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళి, ఏలూరు రూరల్ సీఐ వైవీ లచ్చునాయుడు, నందిగామ రూరల్ ఏఎస్‌ఐ నూతలపాటి నాగేశ్వరరావు, కోడూరు ఎస్‌ఐ ఎస్.ప్రియకుమార్, ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్స్ శివనాగరాజు, ఎస్ చిరంజీవిరావు, పి.హరిబాబులపై క్రిమినల్ స్వభావం, అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఇలా కేసుల్లో ఉన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని నిబంధనలు స్పష్టం చేస్తుండటంతో వీరిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్‌శర్మ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment