ఆ పోస్టు పేరు చెబితేనే అధికారులు హడలిపోతున్నారు. మాకొద్దు బాబోయ్ ఈ కుర్చీ అని పరుగు లంకించుకుంటున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆ పోస్టు పేరు చెబితేనే అధికారులు హడలిపోతున్నారు. మాకొద్దు బాబోయ్ ఈ కుర్చీ అని పరుగు లంకించుకుంటున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలోనే హాట్‌సీటుగా పేరున్న రాజేంద్రనగర్ ఆర్డీఓ పీఠం తాజా పరిస్థితి ఇది. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు కట్టబెట్టిన కేసులో ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటివరకు కాసులు కురిపించే ఈ పోస్టంటే రెవెన్యూ వర్గాల్లో యమక్రేజ్ ఉండేది. ఈ కుర్చీని దక్కించుకునేందుకు సచివాలయ స్థాయిలో లాబీయింగ్ నెరిపేవారు. సీఎం, రెవెన్యూ మంత్రుల సిఫార్సులతో ఈ పదవిని ఎగరేసుకుపోయేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఈ పోస్టు కోసం పైరవీలు ఆగిపోయాయి.
ఖాళీగా ఉంది కదా! అని నామ్‌కే వాస్తేగా అర్జీ పెట్టుకున్నా.. సీరియస్‌గా మాత్రం ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ పనిచేసే అధికారి బదిలీ కానున్నారనే సంకేతాలు వెలువడిన మరుక్షణమే ఈ సీటును చేజిక్కించుకోవడానికి పావులు కదిపే అధికారులు.. ఇప్పుడు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ నవ్‌ఖల్సాలోని సర్వే నంబరు 66లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన కలెక్టర్ అప్పటి ఆర్డీఓపై వేటుకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం ఖాళీ అయిన ఈ పదవిని చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. గతంలో ఈ పీఠం కోసం విశ్వప్రయత్నాలు చేసిన అధికారులు కూడా ఈసారి ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం. భూ ఆక్రమణ లపై జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ కఠినంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో కూడా ఈ పోస్టంటే భయపడేందుకు కారణమై ఉండొచ్చు.
ఇదిలావుండగా.. ఒకరిద్దరు పాత కాపులు ఈ సీటుపై కన్నేసినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల ఆర్డీఓగా వ్యవహరించిన రవీందర్‌రెడ్డి సహా యూఎల్‌సీలో పనిచేస్తున్న అశోక్ కూడా ఈ కుర్చీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు కూడా ఈ పోస్టును ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వీరు ఈ పోస్టు కోసం సీరియస్‌గా దృష్టి సారించడం లేదని, వస్తే సరి.. రాకున్నా పరవాలేదనే ధోరణిలో ఉన్నారని రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒకప్పుడు పోస్టు కోసం లక్షలు ముట్టజెప్పి సచివాలయంలో సీఎం, మంత్రుల పేషీల చుట్టూ ప్రదక్షిణలు చేసిన అధికారులు ఇప్పుడు మాత్రం అటువైపే వెళ్లడం లేదని తెలుస్తోంది.