కరణం హవా... దామచర్ల డీలా! | no preferance to district president in chandrababu's tour | Sakshi
Sakshi News home page

కరణం హవా... దామచర్ల డీలా!

Published Tue, Dec 31 2013 2:40 AM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM

no preferance to district president in chandrababu's tour

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘పార్టీ అధినేత ఎప్పుడెప్పుడొస్తారా... జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెత్తనం చలాయిద్దామా’అని ఆశించిన దామచర్ల జనార్దన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడైనప్పటికీ చంద్రబాబు పర్యటనలో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించనే లేదు. రాజకీయ చతురుడైన కరణం బలరాం వ్యూహాత్మకంగా జనార్దన్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించారు. చంద్రబాబు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడని కూడా చూడకుండా జనార్దన్ కంటే బలరాం వైపే పూర్తిగా మొగ్గుచూపారు.

 చంద్రబాబు పర్యటనలో టంగుటూరు మినహాయిస్తే చంద్రబాబు పర్యటన మొత్తం బలరాం ఆధిపత్యం సాధించారు. డెయిరీ ఫాంలో సమావేశం... అనంతరం ఒంగోలులో ర్యాలీ... బహిరంగ సభ... ఇలా అన్నింటా బలరాందే పైచేయి అయింది. కొంతకాలం క్రితం వరకు దామచర్ల జనార్దన్‌వైపు మొగ్గుచూపుతూ వచ్చిన చంద్రబాబు... జిల్లా పర్యటనకు వచ్చేసరికి పూర్తిగా బలరాంకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం. జిల్లా టీడీపీలో ఇటీవల మారిన వర్గ సమీకరణలకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం

కథాకమామిషు ఇదీ.. బలరాం ఎత్తు... జనార్దన్ చిత్తు
 కొంతకాలంగా జిల్లాలో కరణం బలరాంను దామచర్ల జనార్దన్ ఢీకొంటున్న విషయం విదితమే. ప్రధానంగా అధినేత చంద్రబాబు తన మాట వింటున్నారని చెప్పుకుంటూ దామచర్ల జోరు పెంచారు. అనుబంధ సంఘాల నియమకం తదితర విషయాల్లో ఇది బయటపడింది కూడా. కాగా దీనిపై ఆచితూచి వ్యవహరించిన బలరాం చంద్రబాబు పర్యటన సందర్భంగా చాపకింద నీరులా పావులు కదిపారు. జిల్లా పార్టీ నేతలను గుట్టుచప్పుడు కాకుండా తనవైపు తిప్పుకున్నారు. ప్రధానంగా శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలను సాధనంగా చేసుకున్నారు. తదనుగుణంగా చంద్రబాబు జిల్లా పర్యటనను ఖరారు చేయించారు.

 చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల తన సొంత మండలం టంగుటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా బలరాం వర్గం ఒంగోలు డెయిరీలో పాడి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావుతోపాటు శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావు సహకరించారు. ఇక బహిరంగ సభా వేదికపైన కూడా బలరాం వర్గం దామచర్ల జనార్దన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పార్టీ అధినేత చంద్రబాబు తరువాత ప్రాధాన్యం జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌కు దక్కాలి. అంటే సభలో వేదికపైన ఉన్నవారంతా మాట్లాడిన తరువాత జనార్దన్ ప్రసంగించాలి... ఆ తరువాత చివరగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించాలి. కానీ సోమవారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. కొందరు మాట్లాడిన తరువాత జనార్దన్‌తో మాట్లాడించారు.

ఆ తరువాత మరికొందరు ప్రసంగించారు. చివరగా కరణం బలరాం ప్రసంగించి చంద్రబాబును ఉపన్యసించాల్సిందిగా ఆహ్వానించారు. ఇక అంతకుముందు మాట్లాడిన నేతలు కూడా బలరాంను పొగుడుతూ జనార్దన్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గమనార్హం. శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఁకరణం బలరాం పార్టీ కోసం పనిచేస్తున్నారు*అని ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ సాగర్ జలాల కోసం బలరాం, తాను పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేగానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ ఊసుకూడా ఎత్తలేదు. అంటే జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాల్లో బలరాంతోపాటు తామంతా క్రియాశీలకంగా ఉన్నామని... దామచర్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితర సీనియర్ నేతలతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పార్టీలో తమ ప్రాబల్యం పెరిగేలా బలరాం వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

 కాగా అనుభవరాహిత్యంతో జనార్దన్ వర్గం కరణం ఎత్తుగడను ఊహించలేక చతికిలబడిపోయింది. బహిరంగ సభ అనంతరం జరిగిన జిల్లా పార్టీ విసృ్తతస్థాయి సమావేశంలోనూ బలరాం వర్గం ఆధిపత్యం కొనసాగింది. జిల్లాలో పార్టీ స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై బలరాం వర్గం తమ వాదనను బలంగా వినిపించింది. తద్వారా జనార్దన్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారని పరోక్షంగా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ తన సమక్షంలో జరుగుతున్నా సరే పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ ఆవేదనను కనీసం పట్టించుకోలేదు. ఆయన తీరు కూడా బలరాం వర్గాన్ని బలపరిచేదిగానే ఉంది.

ప్రధానంగా ఆర్థికంగా స్థితిమంతులైన శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావుల ప్రభావం ఆయనపై ఉన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలంటే అలాంటి నేతల అండదండలు ఉన్న బలరాంనే బలపరచాలన్నట్లుగా ఉంది చంద్రబాబు వైఖరి. అటు బలరాం వ్యూహం... ఇటు చంద్రబాబు వ్యూహాత్మక మౌనంతో దామచర్ల జనార్దన్ అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోయారు. ప్రతిష్టాత్మకంగా భావించిన అధినేత పర్యటన తనకే ఎదురుతిరగడంతో ఆయన విస్తుపోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement