కరణం బలరాం కు రాజ్యసభ ఆశ
విజయకుమార్‌కు మండలిలో సభ్యత్వం
పదవుల పేర్లు చెప్పి ఊరిస్తున్న టీడీపీ అధినేత
నమ్మే పరిస్థితిలో లేమంటూ పార్టీ శ్రేణుల నిర్వేదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తెలుగుదేశంలో పెరుగుతున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయకులకు పదవుల తాయిలాలు చూపిస్తున్నారు. అసంతృప్తివాదులకు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తామని, ఇంకా శాసనమండలిలో సభ్యత్వం ఇప్పిస్తామని ఊరిస్తున్నారు. అయితే జిల్లాలోని నాయకులు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో కూడా పదవులు ఇస్తామని చివరి వరకు నమ్మించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
తాజాగా జిల్లాలోని సీనియర్ నాయకుడు కరణం బలరాంకు లోక్‌సభ స్థానానికి బదులు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని అన్నట్లు తెలిసింది. అందుకే ఆయన కుమారుడికి అద్దంకి శాసనసభా నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని కేటాయించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌కు శాసనమండలిలో అవకాశం ఇస్తామని ఆశ చూపుతున్నారు.
సంతనూతల పాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుగానే హామీ తీసుకుని, తెలుగు దేశం పార్టీలో చేరిన విజయకుమార్‌కు చంద్రబాబు చెయ్యిచ్చారు. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు.
నియోజకవర్గాన్ని మార్చాలని టీడీపీ కార్యకర్తలు ఒంగోలులోని సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేయగా, వారిని అదుపు చేయడానికి బీజేపీకి కొండపి లేదా గిద్దలూరు కేటాయిస్తామని మభ్యపెడుతున్నారు.
చివరకు సంతనూతలపాడు నుంచి పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి సిద్ధమవుతున్నారు.
ఇంకా కొంత మంది నాయకులు తమకు సీట్లు కేటాయించాలని కోరడంతో, వారికి కూడా ఏదో ఒక పదవి ఇస్తానని చెప్పి పంపుతున్నట్లు తెలిసింది.
ముందుగా మనం అధికారంలోకి రావాలని, దీనికి కార్యకర్తలు, నాయకులు అన్ని కష్టాలు భరించాలని బాబు వారికి క్లాస్ తీసుకుని పంపుతున్నట్లు తెలిసింది.
తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి తన దగ్గరకు తీసుకురావాలని, తరువాత అందరికి పదవులు ఇస్తానని అంటున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబును సొంత పార్టీ నాయకులే నమ్మడం లేదు.
గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులకు ఏమీ చేయలేకపోయారని, మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఏదో చేస్తాడని అనుకోలేమని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే తెలుగుదేశం వారికి కూడా మంచి జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు.
చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకులు నిర్వేదంతో అనడం గమనార్హం.