కాన్పు కేసా..రిమ్స్‌కు వెళ్లండి
సీరియస్ అయితే..గుంటూరు తీసుకెళ్లండి
ఇదీ జిల్లాలో గర్భిణులకు అందుతున్న వైద్యసేవలు
ఈ ఏడాది 1986 కాన్పులు ఇళ్ల వద్దనే
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్:
అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులెవరైనా ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలకెళ్తే..వారికి కనీస వైద్యసేవలు అందడం లేదు. కాస్త ప్రమాదకర స్థితిలో ఉన్న కేసులన్నింటినీ రిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. అక్కడైనా సరైన వైద్యం అందుతుందా అంటే అదీ లేదు. సీరియస్ కేసు వచ్చిందంటే వెంటనే రిమ్స్ వైద్యులు గుంటూరు తీసుకెళ్లాలని చెబుతుండటంతో గర్భిణుల కుటుంబ సభ్యులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. ఒక వేళ ఆస్పత్రిలో చేర్చుకుని కాన్పు చేసినా..అసౌకర్యాల నడుమ బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లేందుకే గర్భిణులు వెనకడుగు వేస్తున్నారు. ఖర్చయినా..అప్పోసప్పో చేసి ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రసవాలన్నీప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలన్న వైద్యారోగ్య శాఖ లక్ష్యం నెరవేరడం లేదు. పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్‌లోనూ ప్రసవాలు చేయలేక గుంటూరు తరలించిన కేసులు ఈ ఏడాది రెండంకెలు దాటాయి. జిల్లాలో ప్రసవాల కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న గర్భిణులు, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేయించుకునే మహిళలు పడుతున్న ఇబ్బందులను ‘న్యూస్‌లైన్’ బృందం సోమవారం పరిశీలించింది.
జిల్లాలోని 85 పీహెచ్‌సీలు, ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల, రిమ్స్ వైద్యశాల, జిల్లాలోని 7 ఏపీవీవీపీ వైద్యశాలలు, 18 క్లస్టర్ వైద్యశాలలున్నప్పటికీ గర్భిణులైన మహిళలు ప్రైవేటు వైద్యశాలల్లోనో లేక ఇంట్లోనో ప్రసవించడానికే మొగ్గుచూపుతున్నారు. అదే విధంగా జిల్లాలోని 30కు పైగా పీహెచ్‌సీల్లో ఇప్పటికీ ప్రసవాలు జరగడం లేదు. జిల్లాలో 85 పీహెచ్‌సీలు ఉంటే వీటిలో ముగ్గురు గైనకాలజిస్టులు, ఇద్దరు మాత్రమే అనస్తీషియా వైద్యులున్నారు.
నానాటికీ పెరుగుతున్న శిశు మరణాలు:
జిల్లాలో ఏటా అధికారికంగా 389 మంది, లెక్కలోనికి రాకుండా మరో 100కి పైగా శిశువులు పుట్టిన 24 గంటల్లోపే కన్నుమూస్తున్నారు. తక్కువ బరువుతో పాటూ పౌష్టికాహార లోపంతో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తున్నారు. గర్భిణులకు సరైన ఆహారం అందకపోవడంతో పాటూ కనీస వైద్యసేవలు మృగ్యమవడం ఇందుకు ప్రధాన కారణం. మాతా శిశు మరణాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘మార్పు’ అమలు తీరు జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడంలేదు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని వారు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేలా చర్యలు తీసుకోవడం ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తల విధి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వైద్య సిబ్బంది గర్భిణుల వివరాలను నమోదు చేయడంతోనే తమ పని పూర్తయినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రసవానికి ముందు 7వ నెల నుంచి, ప్రసవ సమయంలో గర్భిణులను 108 వాహనంలో ఆస్పత్రికి వైద్య సిబ్బంది దగ్గరుండి మరీ తరలించాలి. కానీ వారు కేవలం పరీక్షలు నిర్వహించడంతోనే సరిపెడుతున్నారు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకువెళ్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు.
పీపీ యూనిట్లో కనీస వసతులు మృగ్యం:
పీపీ యూనిట్ కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేసే విభాగం. ఒంగోలులో ఉన్న పీపీ యూనిట్‌లో మౌలిక వసతుల కల్పనలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఇక్కడ వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ డీపీఎల్ కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు నెలకు వందకుపైగా జరుగుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ విభాగంలో కేవలం 20 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఫ్యాన్లూ నామమాత్రమే. వెలుతురు లేదు. మడత మంచాలు తెప్పించి, టెంట్లు వేయించి డీపీఎల్ క్యాంపులను ప్రతినెలా నెట్టుకొస్తున్నారు. మిగిలిన వారు శస్త్ర చికిత్సల అనంతరం ఎక్కడ ఉండాలో అర్థంకాక తల్లడిల్లుతున్నారు. క్యాంపుల సమయంలో తాగేందుకు మంచినీటి సౌకర్యం కూడా అధికారులు ఏర్పాటు చేయడం లేదు. పీపీ యూనిట్ నిర్మించి 50 ఏళ్లు దాటడంతో కూలేందుకు సిద్ధంగా ఉంది. శ్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు తుప్పు పట్టి ఉన్నాయి. శస్త్ర చికిత్సలు చేసే థియేటర్ కూడా ఇన్‌ఫెక్షన్ సోకేలా ఉంది. సమీపంలో ఉన్న మాతా శిశువైద్యశాలలో, రిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లున్నాయి. వాటిని ఉపయోగించుకుందామన్న ఆలోచన కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు రావడం లేదు.
కనీస పరిజ్ఞానం లేని అధికారులు:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారిణికి కనీసం తమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు కూడా తెలియకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అధికారులకే తెలియకపోతే క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరును ఏ విధంగా పరిశీలిస్తారో వారికే తెలియాలి.
పసవ వేదన
Published Tue, Feb 4 2014 3:38 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement