సాక్షి,విశాఖపట్నం: రుతుపవనాలు గతి తప్పడంతో జిల్లా రైతులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పంటల సాగు సమయంలో ముఖం చాటేస్తున్న వర్షాలు అనంతరం అనూహ్యంగా వచ్చిపడే తుపాన్లు, వాయుగుండాలప్పుడు ముమ్మరిస్తున్నాయి. కొన్ని మండలాల్లో అధికం నమోదవుతుండగా,కొన్నింట సాధారణంలో సగం కూడా కురవడం లేదు. ఇవి గణాంక విభాగానికి, ఇటు వ్యవసాయాధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో వర్షపాతం బాగానే ఉన్నప్పటికీ పంటలెందుకు తగ్గుతున్నాయనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. ఈపాటికే అంతటా నాట్లు పూర్తయి పంట పొట్టదశదాటి కంకులు బయటకు రావాలి.
ఆ పరిస్థితి లేదు. మొత్తంగా రైతుకు నష్టమే వాటిల్లుతోంది. ఖరీఫ్‌కు సిద్ధమయ్యే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 142.8 మిల్లీమీటర్లకు 49.4 మిల్లీమీటర్లే కురిసింది. అత్యంత కీలకమైన కాలం(జూన్-సెప్టెంబర్)లో 646.7 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 353.4 మిల్లీమీటర్లు నమోదయింది. ఖరీఫ్ ముగియడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 98,718 హెక్టార్లు. ఆరంభంలో వర్షాలు నెమ్మదించడంతో అధిక శాతం మండలాల్లో అసలు ఉభాలే జరగలేదు. ఇంతవరకూ 53వేల హెక్టార్లలో నాట్లేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సగానికిపైగా హెక్టార్లలో పంట ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఇలా జిల్లాలో వరిసాగు సంక్షోంభంలో చిక్కుకుంది. ఈపాటికే ఏపుగా పెరిగి కళకళలాడాల్సిన పైరు పలు ప్రాంతాల్లో ఎర్రబారింది. చుక్కనీరు లేక మైదానంలోని సగం మండలాల్లో అసలు ఎరువాకే మొదలవలేదు.
ఈసారైనా కరుణించేనా?
ఈ ఏడాది వాతావరణం అనుకూలించి వరిసాగు సుమారు లక్ష హెక్టార్లకు చేరుకుంటుందని వ్యవసాయశాఖ అంచనాకట్టింది. ఇందుకోసం 22,040 క్వింటాళ్ల విత్తనాలు, 76,849 మెట్రిక్ టన్నుల ఎరువులు సైతం రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ పరిస్థితి దయనీయంగా మారింది. క్యుములోనింబస్ మేఘాల జాడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు,వాయుగుండాలు ఏర్పడకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్పపీడనద్రోణి,ఆవర్తనాలు వల్ల కొన్ని చోట్ల వర్షాలు అప్పుడప్పుడూ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వరిసాగు జాగయింది. అనకాపల్లి, నర్సీపట్నం,ఎలమంచిలి,చోడవరం,పాయకరావుపేట,మాడుగుల తదితర నియోజకవర్గాల్లో నీటి సదుపాయం లేక ఇప్పటికీ నాట్లు ప్రారంభంకాలేదు. సుమారు 25వేల హెక్టార్లలో ముదిరిన నారుతో వేసిన నాట్లు ఎండిపోయాయి.
ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం పరిధిలో పరిస్థితి దయనీయంగా ఉంది. 3,500 హెక్టార్లకు రెండు వేల హెక్టార్లలో అసలు నాట్లేపడలేదు. మిగిలిన 1500 హెక్టార్లలోని పంట ఎండిపోతోంది. బుచ్చెయ్యపేట,చోడవరం,రావికమతం,రోలుగుంట మండలాల్లో ఇంకా ఐదు వేల హెకార్లలో నాట్లు వేయాల్సి ఉంది. ఎలమంచిలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఎలమంచిలి,రాంబిల్లి అచ్యుతాపురం,మునగపాక మండలాల్లో 9 వేల హెక్టార్లలో నాట్లు ఇంకా మొదలు కాలేదు. అనకాపల్లిగ్రామీణ ప్రాంతంలో ఏటా ఖరీఫ్‌లో 2,400హెక్టార్లలో వరిపంట చేపడుతుంటారు. ఇప్పటివరకు 600 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఇందులోనూ 200 హెక్టార్లలో పంట ఎండిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు అధిక వర్షాలు పడినా ఫలితం ఉండదంటున్నారు.
ఐదేళ్లలో వర్షపాతం వివరాలు
నెల సాధారణం 2009 2010 2011 2012 2013
జూన్ 128.8 54.0 131.4 23.8 44.4 87.0
జూలై 197.7 104.8 268.8 134.4 168.6 111.4
ఆగస్టు 193.0 101.6 94.8 144.2 183.6 155.0
వరికి వెన్నుపోటు
Published Wed, Sep 4 2013 5:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement