
టీడీపీతో పొత్తు ప్రతిపాదన లేదు: వెంకయ్య
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేయాలన్న రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు 42 ఎంపీ, 294 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తామని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఇందుకోసం సన్నద్ధమవుతున్నామన్నారు. తెలుగుదేశంతో పొత్తు ప్రతిపాదన లేదని చెప్పారు. ఏవైపు నుంచీ ఇటువంటి అంశం చర్చకు రాలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలకు తమకు సంబంధం లేదని, ఊహాగానాలు చేసుకునే అధికారం మీడియాకు ఉందని చెప్పారు.
లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన గురువారమిక్కడ పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె లకష్మణ్, ఎన్.రామచంద్రరావు, వై.రఘునాధ్‌బాబు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొత్తులతో టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందేమో ఆ నాయుడే (చంద్రబాబు) చెప్పాలని చమత్కరిస్తూ తమ పార్టీ సొంతంగానే అన్ని సీట్లకు పోటీకి సమాయత్తమవుతుందన్నారు. సీమాంధ్రప్రాంత పార్టీ నాయకులు తమ కేంద్ర నాయకత్వాన్ని కలిసి చర్చలు జరుపుతామన్నారే తప్ప తెలంగాణ బిల్లును వ్యతిరేకించడం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే దానికే కట్టుబడ్డామన్నారు. సీమాంధ్ర సమస్యల్ని చర్చించుకోవడంలో తప్పు లేదన్నారు. అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా తయారయిన సీబీఐ ఎప్పుడేమి చేస్తుందో తెలియడం లేదని చెప్పారు.
ప్రవాస భారతీయుల సమ్మేళనానికి వస్తున్న బాబా రాందేవ్‌ను రెడ్‌కార్నర్ నోటీసు ఉందన్న సాకుతో లండన్ విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్మగ్లర్లు, ఉగ్రవాదులు, దోపిడీ దొంగలకు ఇచ్చే రెడ్‌కార్నర్ నోటీసు రాందేవ్ బాబాకు ఎందుకిచ్చారో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తేలుస్తామన్నారు.
భోపాల్‌లో బుధవారం జరిగిన బీజేపీ కార్యకర్తల మహాకుంభ్ గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ గెలుపు ఖాయమన్నారు. మోడీ పాదాభివందనం చేసినా అద్వానీ పట్టించుకోలేదన్న వార్తలను తోసిపుచ్చారు. ఈనెల 29న నరేంద్రమోడీ ఢిల్లీలోని జపనీస్ పార్క్ లో ప్రసంగిస్తారని చెప్పారు. మోడీ పట్ల రోజురోజుకు మరింత మోజు పెరుగుతోందన్నారు. దేశ రహస్యాలను బయటపెడుతున్న వ్యవహారంపై విచారణ జరిపించాలని, నిందితులపై దేశద్రోహ నేరం మోపి శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్న వాళ్లను కాపాడేందుకే ‘దోషులు సైతం పోటీ చేయవచ్చన్న’ దానిపై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్‌స తీసుకువస్తోందని ఆరోపించారు. ఈ ఆర్డినెన్‌స దేశప్రజలకు తీరని నష్టమన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డుతో అనుసంధానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. దావూద్ ఇబ్రహీం సహా ముంబాయి పేలుళ్ల కేసులోని నిందితులందర్నీ భారత్‌కు అప్పగించేంత వరకు పాక్‌తో చర్చలు జరపకూడదన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు తమ చర్చలకు అడ్డుకాదన్న ప్రధాని మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
2న ఢిల్లీకి సీమాంధ్ర నేతలు
బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు వచ్చేనెల రెండున ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్రనాయకుల్ని కలుస్తారు. విభజన బిల్లులో సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తేనే మద్దతు ఇమ్మనికోరనున్నట్టు ఆ కమిటీ ఛైర్మన్ వై.రఘునాధ్‌బాబు తెలిపారు. కాగా, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నాయకుల్ని మూడు బృందాలుగా ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.