టీడీపీతో కలసి రైతు యాత్రలా?
బీజేపీ పదాధికారుల సమావేశంలో నేతల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం టీడీపీతో కలసి యాత్ర ఎం దుకు చేయాలని, పార్టీ శ్రేణులతోనే చేయలేమా అని బీజేపీ పదాధికారుల సమావేశంలో పలువురు నేతలు ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, వి.రామారావు, ఇంద్రసేనారెడ్డితో పాటు ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
టీడీపీ చేపడుతున్న యాత్రల్లో బీజేపీ భాగస్వామ్యం కావాలని ముందుగా ప్రతిపాదించారు. ఎన్నికల్లో పొత్తు ఉంటే ఎన్నికల్లోనే చూసుకుందాం, అప్పటిదాకా పార్టీ విడిగానే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు వాదించారు. టీడీపీతో కలసి యాత్రలు చేపడితే పార్టీ విస్తరణ, బలోపేతం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రుణమాఫీ సాధించుకోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలసి పనిచేయడమే మంచిదని సీనియర్లు చెప్పారు.