పొలిటికల్ షో!
► జోరెక్కిన గ్రేటర్ ప్రచారం
► 30న పోటాపోటీ సభలకు సన్నాహాలు
► తరలి వస్తున్న అగ్రనేతలు
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచార హోరు పెరిగింది. వివిధ పార్టీల అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ఇంటింటి ప్రచారాలు చేస్తుండగా... అగ్ర నాయకులంతా రోడ్ షోలతో బిజీగా ఉన్నారు. ప్రచారానికి ఇంకా ఆరు రోజులే గడువు ఉండటంతో ముఖ్య నాయకులంతా నగరాన్ని చుట్టేసేందుకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారానికి సారథ్యం వహిస్తున్న కేటీఆర్ ఆదివారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రుల భద్రతకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని గుర్తు చేశారు. మున్ముందూ ఇదే తీరు కొనసాగుతుందని ప్రకటించారు. ఇక తెలుగుదేశం-బీజేపీల తరఫున నారా లోకేష్ ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలోని అంబర్‌పేట, కాచిగూడ, భాగ్‌అంబర్‌పేట ప్రచారాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అజెండాను విడుదల చేసింది.
పోటాపోటీ సభలు
ఈ నెల 29వ తేదీ వరకు రోడ్ షోలతో ప్రచారాన్ని నిర్వహించనున్న ప్రధాన పార్టీలు 30నభారీ సభలకు సన్నాహాలు చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ నిజాం కళాశాలలో నిర్వహించే సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. తెలుగుదేశం-బీజేపీ సభలకు కేంద్ర మంత్రులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ 29న దిగ్విజయ్‌సింగ్, 30న గులాంనబీ ఆజాద్‌లతో భారీ సభలకు సన్నాహాలు చేస్తోంది. ఈలోగా సినీ నటులు చిరంజీవి, అజహరుద్దీన్‌లనునగరంలో ప్రచారానికి వినియోగించే అంశాలను పరిశీలిస్తోంది.