
సరుకే లేదు..సరసమైన ధరలా!
నెల్లూరు(టౌన్): ‘నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. ఈ ధరలు దిగి వచ్చేంత వరకు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు ఎర్రగడ్డలు, కూరగాయలను సరసమైన ధరలకు విక్రయిస్తాం. ప్రత్యేక కౌంటర్లను ప్రజలు వినియోగించుకోవాలి.’ మూడు రోజుల క్రితం నెల్లూరులోని రైతుబజార్‌లో ఎర్రగడ్డల కౌంటర్ ప్రారంభం సందర్భంగా జాయింట్ కలెక్టర్ రేఖారాణి అన్న మాటలివి. ఇదం తా నిజమేనని తెలిసి కౌంటర్ల వద్దకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఎప్పుడు వచ్చినా సరుకులు లేవనే సమాధానమే వస్తోంది.
ఈ విక్రయ కేంద్రాలకు అరకొరగా సరుకులు తీసుకొస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకే ఫత్తేఖాన్‌పేట రైతుబజార్‌లోని కౌంటర్‌లో ఎర్రగడ్డలు అయిపోయాయి. కూరగాయలు కూడా రెండు, మూడు కిలోలు మాత్రమే ఉన్నాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి. ఉదయం 10.50 గంటల సమయంలో ఎర్రగడ్డలు కేవలం నాలుగైదు కిలోలు మాత్రమే ఉన్నాయి. 6 బస్తాల ఎర్రగడ్డలు తెచ్చామని, వాటిలో రెండు మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా కాలనీలకు తీసుకెళ్లామని సిబ్బంది తెలిపారు. మళ్లీ ఎప్పుడు తెస్తారని అడిగితే ఇక రేపే కదా..అని సమాధానమిస్తున్నారు. నవాబుపేట రైతుబజారులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
బియ్యం నాణ్యతపై విమర్శలు
ఎర్రగడ్డలు, కూరగాయల విక్రయాల పరిస్థితి అలా ఉంటే, సన్నబియ్యం విక్రయ కేంద్రాల పరిస్థితి మరోలా ఉంది. నాణ్యమైన సన్న బియ్యాన్ని కిలో రూ.30కే విక్రయిస్తామని అధికారులు రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే బియ్యంలో నాణ్యత కొరవడిందని ఆరోపిస్తూ ప్రజలు కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం నాణ్యమైన బియ్యం ఉంచి, మిగిలిన సమయాల్లో కల్తీ బియ్యం అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో బియ్యం విక్రయ కేం ద్రాలు వెలవెలబోతున్నాయి. ఈ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగితే తమకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు లభిస్తాయని వినియోగదారులు ఆశిస్తున్నారు.