
రొయ్యలను ఆరబెడుతున్న వృద్ధురాలు
కోడూరు(అవనిగడ్డ) : ఎండు చేపకు కష్టం వచ్చింది. రోడ్డుపైనే ఎండాల్సి వస్తోంది. ఎండబెట్టుకునేందుకు వసతులు లేవు. వేటకు వెళ్లి తెచ్చుకున్న సంపద కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రోడ్లనే కల్లలుగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ రోడ్డు చూసినా ఎండు చేపలతో నిండిపోయాయి.
వివరాలు.. మండల పరిధిలో పాలకాయతిప్ప, హంసలదీవిల్లో 300 మత్స్యకార కుటుంబాలున్నాయి. గంగపుత్రులు తమకు సముద్రంలో దొరికిన మత్స్యసంపదలో పెద్దవాటిని విక్రయించి, చిన్న చేపలు, రొయ్యలను ఆరపెట్టి, అవి ఎండిన తరువాత విక్రయిస్తుంటారు. అయితే పాలకాయతిప్పలో సరుకును ఎండపెట్టుకునేందుకు ఏ విధమైన ప్లాట్‌ఫాంలు నిర్మించకపోవడంతో గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే ఇలా ఆరబెడుతున్నారు. దీంతో ప్రస్తుతం దింటిమెరక బైపాస్ రహదారి దగ్గర నుంచి కరకట్ట వరకు సుమారు కిలోమీటరన్నరకు పైగా ప్రధాన రహదారి ఒకవైపు పూర్తిగా ఎండిన సరుకుతో నిండిపోయింది. సాగర సంగమానికి వచ్చే యాత్రికులు ఈ రోడ్డు మీదగానే ప్రయాణం చేయాల్సి ఉండడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. ఎండు చేపలు, రొయ్యల వాసనతో ఇక్కట్లు పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటకైన పాలకులు స్పందించి తమ సంపదను ఎండపెట్టుకొనేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలను నిర్మించాలని పాలకాయతిప్ప గ్రామస్తులు కోరుతున్నారు.