సమస్యల కూత! | Minimum Facilities Requirements In Mahabubnagar Railway Station | Sakshi
Sakshi News home page

సమస్యల కూత!

Published Mon, Jun 17 2019 7:35 AM | Last Updated on Mon, Jun 17 2019 7:35 AM

Minimum Facilities Requirements In Mahabubnagar Railway Station - Sakshi

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక స్టేషన్‌లో తాగునీటి ఇబ్బంది వేధిస్తుండగా.. మరో స్టేషన్‌లో సరిపడా బాత్‌రూంలు లేక, వెయిటింగ్స్‌ హాల్స్‌ వినియోగానికి రాక, లోలెవల్‌ ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చెందక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

గ్రామీణ సమస్యలను సర్పంచ్‌లు, కార్యదర్శులు పట్టించుకుంటే.. పట్టణ, మున్సిపాలిటీ సమస్యలను కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనర్లు పట్టించుకుంటారు.. అలాగే బస్టాండుల్లో ఉన్న సమస్యలను డీఎంలు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పట్టించుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. కానీ రైల్వేస్టేషన్ల వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్కడి సమస్యలు  బయటికి రావడంలేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహణ ఉండటంతో తమకెందుకులేనని అందరూ అనునకోవడంతో ఏళ్లు గడిచినా రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచడంలేదు. దీంతో సమస్యలను వెలికితీయడానికి ‘సాక్షి’ బృందం స్టేషన్లను సందర్శించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో రెండో పెద్ద స్టేషన్‌ మహబూబ్‌నగర్‌. జిల్లా పరిధిలోని స్టేషన్ల గుండా ప్రతి రోజు 7వేల నుంచి 8వేల మంది ప్రయాణం సాగిస్తుండగా..ప్రతి రోజు సుమారు రూ.7 నుంచి 9 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అయితే, స్టేషన్‌ ఆవరణలో బాత్‌రూంలు లేక, స్టేషన్‌లో ఉన్న బాత్‌రూంలు సరిపడా లేక ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా స్టేషన్‌ ఆవరణలో నిర్మించిన రైల్వే కమ్యూనిటీ భవనం వృథాగా మారింది. స్టేషన్‌ ఆవరణలోని పార్కు కూడా అస్తవ్యస్తంగా ఉంది.  స్టేషన్‌కు అతిసమీపంలోని మోతీనగర్‌వాసులు పట్టాలపై నుంచి పట్టణంలో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌యూబీ నిర్మించాలని కాలనీవాసులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ రైల్వే స్టేషన్‌ బీ–గ్రేడ్‌ హోదాలో ఉంది. ఏ–గ్రేడ్‌ కోసం ఎదురుచూస్తున్నా ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. రైల్వేస్టేషన్‌కు ఏ–గ్రేడ్‌ హోదా లభిస్తే స్టేషన్‌లో మరెన్నో సౌకర్యాలు అందుతాయి.

తాగునీటి ఎద్దడి తీవ్రం

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల రైల్వేస్టేషన్‌ సమస్యలకు నిలయంగా మారింది. ప్రధానంగా స్టేషన్‌లో తాగునీటి సమస్య వేధిస్తుంది. ఉన్న రెండు బోర్లు వట్టిపోవటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు అవి చాలకుండా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క చోట తాగునీటి కోసం నల్లాలద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. స్టేషన్‌ ప్రాంగణంలో పలుచోట్ల నల్లాలు ఏర్పాటు చేసినప్పటికి అవి నిరుపయోగంగానే మారాయి. అదేవిధంగా కోతులు ప్రయాణికులను ప్లాట్‌ఫాంపైకి రానీవ్వకుండా పరుగులు పెట్టిస్తున్నాయి. రైలు వచ్చి స్టేషన్‌లో నిలబడితే మొదటిప్లాట్‌ఫాం నుంచి టికెట్‌ కొనుగోలు చేసి రెండవ ప్లాట్‌ఫాంలో ఆగిన రైలు ఎక్కాలంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. నీటి కొరత కారణంగా ఉన్న టాయిలెట్స్‌ మూసి ఉంచుతున్నారు. 

వృథాగా వెయిటింగ్‌ హాల్‌

దేవరకద్ర: దేవరకద్ర రైల్వే స్టేషన్‌ను ఇటీవల కొత్తగా నిర్మించారు. ఈ స్టేషన్‌లో కేవలం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే నిలుస్తాయి. ఈ స్టేషన్‌ నుంచి నెలకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇటీవల ఇక్కడి నుంచి మునీరాబాద్‌ రైల్వే లైన్‌ వేరు పడడం వల్ల ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా ప్రకటించారు. అయినా దానికి తగ్గట్లు సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. స్టేషన్‌లో క్యాంటిన్‌ మూతపడగా, వెయిటింగ్‌ హాల్స్‌ నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు చెట్ల కింద బెంబీలపై వేచి ఉండే పరిస్థితి ఉంది. తాగునీటి సౌకర్యం ఉన్న కులాయిలు సక్రమంగా పని చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రం అయిన ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపడం లేదు. దీని వల్ల ప్రయాణికులు జిల్లా కేంద్రం వెళ్లి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

ప్లాట్‌ఫాం ఎత్తు పెంచక అవస్థలు 
మండలంలోని కౌకుంట్ల, కురుమూర్తి రైల్వేస్టేషన్లలోనూ ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు రైలు ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక రెండు స్టేషన్లలోను క్యాంటిన్‌ మూత పడడం వల్ల ప్రయాణికులకు కనీసం టీ కూడా దొరకని పరిస్థితి ఉంది. కురుమూర్తి రైల్వేస్టేషన్‌ చాలా పురాతనమైనది. ఈ స్టేషన్‌ నిర్వహణను రైల్వే శాఖ ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది.  

హైలెవల్‌ ప్లాట్‌ఫాం లేక అవస్థలు

అలంపూర్‌: జోగుళాంబ రైల్వేస్టేషన్‌లో ప్రధానంగా లోలెవల్‌ ప్లాట్‌ ఫాంతో ఇబ్బంది నెలకొంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు రైళ్లు ఎక్కడానికి అవస్థలు పడుతున్నారు. హైలెవల్‌ ప్లాట్‌ ఫాం నిర్మిస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా, ఈ స్టేషన్‌లో ఏపీ సంపర్క్, బెంగుళూరు–వెంకటాద్రి, చైన్నైఎగ్‌మోర్, యశ్వవంత్‌పూర్‌ వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. 

కానరాని సీసీ కెమెరాలు

బాలానగర్‌ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్‌లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్‌ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్‌ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్‌లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్‌ మూసే ఉంచారు.

బాలానగర్‌ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్‌లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్‌ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్‌ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్‌లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్‌ మూసే ఉంచారు.

మూడేళ్ల కిందటి వరకు స్టేషన్‌లో క్యాంటీన్‌ ఉండేది. ఆ తర్వాత తీసివేశారు.  ప్రయాణికులు ఏమైనా తిందాం అన్నా, నీరు తాగుదామన్నా క్యాంటీన్‌ లేని పరిస్థితి.  ఉన్న కొళాయిల్లో నీరు రాని పరిస్థితి నెలకొంది.  – ఆంజనేయులు ప్రయాణికుడు దేవరకద్ర 

ఎండలోనే ఎదురుచూడాలి

మదనాపురం (వనపర్తి): ఒకప్పుడు వర్తక వ్యాపారంతో ఎంతో ప్రఖ్యాతి చెందిన మదనాపురం(వనపర్తి రోడ్డు) రైల్వే స్టేషన్‌లో షెడ్లు లేక ప్రయాణికులు ఎండలో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. స్టేషన్‌ నుంచి ఎక్కువగా  తిరుపతి, హైదరాబాదు, హుబ్లీ, రాయచూర్, పూణె, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే, స్టేషన్‌లో ఇటీవల నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకరాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండవ ప్లాట్‌ఫాం ఉన్నప్పటికీ ప్రయణికుల కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఎండలోనే నిల్చునే పరిస్థితి నెలకొంది.

 ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాలి
కౌకుంట్ల స్టేషన్‌లో ప్లాట్‌ఫారం ఎత్తు పెంచాలి. మాలాంటి వాళ్లు రైలు ఎక్కాలంటే ఇబ్బందులు పడుతున్నాం. పాత కాలంలో ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్‌ ఫారం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రైలు ఎంతో ఎత్తులో ఉంటుంది. మెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – లక్ష్యయ్య, ప్రయాణికుడు, కొత్తకోట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement