
సమ్మెలు వద్దు.. సమస్యలపై చర్చిద్దాం: తెలంగాణ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని తీసుకుందని, దానిపై సీమాంధ్రలో ఉద్యోగులు, నాయకులు సమ్మెలు, ఆందోళనలకు దిగడం సరికాదని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, వెంటనే ఆందోళనలను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యోగులతో పాటు హైదరాబాద్‌లోని ప్రజలందరి భద్రతకూ తాము భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్ వద్ద డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. సీమాంధ్రలో ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, తెలంగాణ అంశంలో ఢిల్లీ పరిణామాలపై వారు చర్చించారు. తెలంగాణ మంత్రులుగా భరోసా ఇచ్చి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలని, పలు ఇతర అంశాలపైనా ఆ ప్రాంత నేతలతో సానుకూల వాతావరణంలో చర్చించాలని అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఆంటోనీ కమిటీకి తెలంగాణకు సంబంధించిన అంశాలను వివరించాలని నిర్ణయించారు. ఈ మేరకు 18వ తేదీన తెలంగాణ ప్రాంత నేతలు సమావేశమై నివేదికను రూపొందించనున్నారు. అదే సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. భేటీ అనంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగ భద్రత, పెన్షన్లు, ఇతర అంశాలపై ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విధివిధానాలు పూర్తయ్యేవరకు సీమాంధ్ర ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో భాగమేనని జానారెడ్డి స్పష్టం చేశారు. ఆందోళనలు చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎన్జీవోలు కూడా సీమాంధ్ర ఉద్యోగుల్ని రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని కోరారు. వారితో సయోధ్యతో వ్యవహరించి సమ్మె విరమించేలా చేయాలన్నారు. హైదరాబాద్‌పై ఆందోళన అనవసరమని, అది అంత ర్జాతీయ కేంద్రంగా మారిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమయాభావం వల్ల వారిని ఆహ్వానించలేకపోయామని, ఇకపై వారు ప్రతి సమావేశానికి వచ్చేలా చూస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.