నిఘా నై | no Vigilance in basara temple | Sakshi
Sakshi News home page

నిఘా నై

Published Mon, Oct 7 2013 3:23 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

no Vigilance in basara temple

 భైంసా, న్యూస్‌లైన్ :
 చదువుల తల్లి సరస్వతీ క్షేత్రానికి రోజూ 10 వేల నుంచి 20 వేల వరకు భక్తులు అక్షర శ్రీకారాల కోసం వస్తుంటారు. మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాల నుంచి.. జిల్లావాసులతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మూలా నక్షత్రం, వసంత పంచమి, గురు పౌర్ణమి, శివరాత్రోత్సవాలు, శరన్నవరాత్రులు వంటి ముఖ్య రోజుల్లో లక్షల్లో భక్తులు వస్తారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు దర్శించుకుంటారు. అటువంటి బాసరలో భద్రత మాత్రం కరువైంది. తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉగ్రవాదులు కుట్రపన్ని పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విధితమే. తమిళనాడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశారు.
 
  ఉగ్రవాదుల లక్ష్యం బ్రహ్మోత్సవాలు నిర్వహించే ప్రాంతాలు కావడంతో బాసర భద్రతపై పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దసరా నవరాత్రుల్లో నిర్వహించబోయే బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రుల వేడుకల్లో పాల్గొనే వేలాది మంది భక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారన్న అనుమానాలు ఈ సంఘటన బలం చేకూరుస్తోంది. ఇలాంటి సమయంలో బాసరలోనూ భద్రత పెంచి భక్తులకు భయపడకుండా భద్రత పెంచాల్సిన అవసరం ఉంది.
 
 భద్రత డొల్ల
 బాసర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. బాసర రైల్వేస్టేషన్ ఆంధ్ర, ధర్మాబాద్ రైల్వేస్టేషన్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నాయి. బాసరకు రావాలంటే రోడ్డు మార్గం కంటే రైలు మార్గమే సులువు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రధానంగా రైల్వేస్టేషన్ నుంచే బాసర ఆలయానికి చేరుకుంటారు. నిత్యం రైల్వేస్టేషన్ రద్దీగా ఉంటుంది. రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవు. తనిఖీలు చేసే వారు లేరు. మరణాయుధాలు తీసుకొచ్చి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అనుమానితులను గుర్తించి వారిని విచారించే సిబ్బంది లేరు. రైళ్ల నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఎటు వెళ్తున్నారు? అని దృష్టిసారించడానికి తగిన పోలీసు, రైల్వే సిబ్బంది లేరు. తాజాగా భద్రత పటిష్టంగా లేకపోవడంతోనే బాసర ప్రధాన ఆలయం ముందు వ్యాపారం చేసుకునే వ్యాపారితోపాటు తన భార్య, కొడుకు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇదంతా కూడా రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చేసినట్లు తేలింది.
 
  ఈ హత్యకు పాల్పడింది మహారాష్ట్రకు చెందిన పార్ధీ ముఠాగా వెల్లడైంది. అంటే వీరు రైల్వేస్టేషన్ నుంచే నేరుగా వచ్చి హత్య చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. భద్రత ఉంటే వ్యాపారి కుటుంబం హత్యకు గురై ఉండేవారు కాదేమో. సీసీ కెమెరాలు ఉం టే అనమానితుల చిత్రాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. రాకపోకలు సాగించే వివరాలు కూడా నమోదు చేస్తే బావుం టుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆలయ మార్గమధ్యలో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ఎవరినీ గుర్తు పట్టని పరిస్థితి ఉంది. వాహనాలకు కూడా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి. స్నాన ఘట్టాల వద్ద కూడా పోలీస్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
 
 అదనపు బలగాలు అవసరం
     బాసర ఆలయం చుట్టూ ఫెన్సింగ్ లేదు. కనీసం ప్రహరీ లేదు. పోలీసులు పహారా ఉండరు. ఆలయంలోకి ఎటువైపు నుంచైనా రాకపోకలు సాగించే వీలుంది. ఆలయంలో కర్రలు పట్టుకుని హోంగార్డులే విధులు నిర్వహిస్తారు. పోలీసులు మాత్రం పహారా ఉండరు. రెండు ముఖద్వారాలు ఉంటే బావుంటుంది. ఒకటి రావడానికి.. మరొకటి పోవడానికి.. భక్తులు ఆలయానికి రక్షణ కల్పించాలని అధికారులకు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళా భక్తులు కోరుతున్నారు. ఆలయం చుట్టూ పోలీసులతో పహారా నిర్వహించేటట్టు చూడాలి.
 
     ఇంత పెద్ద ఆలయం బాసర పోలీస్‌స్టేషన్, ముథోల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముథోల్‌లోనే ఉంటారు. భైంసా డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ సర్కిల్‌లో ఉన్న బాసర పోలీస్‌స్టేషన్‌లో అదనపు స్థాయి అధికారులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాసరలోనే సర్కిల్ స్థాయి అధికారి ఉండేలా చర్యలు చేపట్టాలి. బాసర ఆలయ ప్రాంగణంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఆలయం కోసం అదనపు బలగాలను మోహరించాలి.
 
     {పస్తుతం బాసరలో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక రైటర్, ఎస్‌హెచ్‌ఓ ఒకరు, కానిస్టేబుళ్లు 21 మంది ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్‌కు ఒక వాహనం కేటాయించారు. 29 మంది సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రతిసారి అదనపు బలగాలను బాసర పంపుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ క్షేత్రంపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
 
     లక్షల సంఖ్యలో రాకపోకలు కొనసాగే అమ్మవారు కొలువుదీరిన బాసర రైల్వే కేంద్రంలోనూ ఆ శాఖ తమ సిబ్బందిని పెంచుకోవాలి. రైల్వే పోలీస్ కేంద్రం ఏర్పాటు చేసి సర్కిల్‌స్థాయి అధికారిని నియమిస్తే రైలు మార్గం గుండా వచ్చేవారి కదలికలపైన దృష్టి సారించవచ్చు.  
 
     చంద్రబాబు హయాంలో 2002లో గోదావరి పుష్కరాలు జరగ్గా అప్పుడు బాసరలో ఐఏఎస్ స్థాయి అధికారిని, డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ప్రతిపాదించారు. 2014 సంవత్సరంలో మళ్లీ గోదావరి పుష్కరాలు వస్తున్నా ఇంతవరకు ఆ ప్రతిపానదలు నెరవేర లేదు.
 
     ఆలయం లోపలికి సెల్, కెమెరాలను నిషేధించాలి. ఫొటోలు తీసుకుని రెక్కీ నిర్వహించి సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంది.
 
     కనీసం మంచిర్యాల గుడిపేట వంటి బెటాలియన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఏదైన సంఘటన జరిగినపుడు అయినా వారిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఒక ఫైరింజన్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ప్రముఖంగా మహారాష్ట్రకు ఈ ప్రాంతం సరిహద్దు కావడంతో భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడికి వచ్చే భక్తులు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement