మళ్లీ చిక్కిన మంత్రి శంకర్
- 250 కేసులు...209 కేసుల్లో శిక్ష
- 40 తులాల బంగారం స్వాధీనం
- బ్యాంకులో మరో 25 తులాలు..
మంత్రి శంకర్. ఈ పేరు తెలియని పోలీసు ఉండడు. అలాగే నగరవాసులుకూ ఇతగాడి పేరు సుపరిచితమే. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలు చేయడంలో దిట్ట. ఏ ఇంట్లో చోరీ జరిగినా.. పోలీసులు మొదట అనుమానించేది శంకర్‌నే. ఈ ఘరానా దొంగ మహంకాళి ఏసీపీ స్పెషల్ పార్టీ పోలీసులకు మరోసారి చిక్కాడు.
డీసీపీ జయలక్ష్మి సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో తెలిపిన వివరాల ప్రకారం... మంత్రి శంకర్ అలియాస్ శివన్న అలియాస్ శివప్రసాద్(53) గతంలో చిలకలగూడలో ఉండేవాడు. కొంతకాలంగా మహారాష్ట్ర లాథూర్‌లోని ఔసా పట్టణంలో ఉంటున్నాడు. తన పేరు శివన్న అని, ఫైనాన్సియర్‌నని చెప్పుకుంటూ అక్కడ చెలామణి అవుతున్నాడు.
చోరీ చేసి మహారాష్ట్రకు చెక్కేస్తాడు...
మంత్రి శంకర్ చోరీ చేసేందుకు రాత్రి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటాడు. తాళం వేసి ఉన్న ఓ ఇంటిని గుర్తించి, తాళం పగులగొట్టి ‘పని’ కానిచ్చేస్తాడు. చోరీ సొత్తుతో ఉదయాన్నే ఇతర రాష్ట్రాలకు చెక్కేస్తాడు. అక్కడ జల్సా చేసి, చేతిలోని డబ్బు అయిపోయాక నగరానికి తిరిగి వచ్చి మళ్లీ చోరీలు చేస్తాడు. ఇలా 1980 సంవత్సరం నుంచి నేరాలు చేస్తున్నాడు. చోరీ చేస్తూ పోలీసులకు చిక్కితే జైలుకెళ్లడం, బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ‘పంజా’ విసరడం ఇతని నైజం.
250కి పైగా కేసులు...
మంత్రి శంకర్‌పై 250కి పైగా కేసులున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 209 కేసుల్లో శిక్ష ఖరారైంది. వివిధ పోలీసు స్టేషన్లలో 22 సార్లు అరెస్టయ్యాడు. నగరంలోని కార్ఖానా, తిరుమలగిరి, ముషీరాబాద్, సనత్‌నగర్, బోయిన్‌పల్లి, పంజగుట్ట, చిక్కడపల్లి, గాంధీనగర్, ఎస్‌ఆర్‌నగర్, ఉప్పల్, బేగంపేట్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని నెలల క్రితమే జైలు నుంచి విడుదలైన శంకర్ ఆ తర్వాత బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో 3, ఓయూ పరిధిలో 6, నాచారంలో ఒక చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
40 తులాల బంగారం స్వాధీనం...
విశ్వసనీయ సమాచారం మేరకు చిలకలగూడలో ఉన్న మంత్రి శంకర్‌తో పాటు దొంగసొత్తు కొంటున్న ఇతని 3వ పెళ్లాం తండ్రి సంజయ్ పాటిల్(66)లను అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర 40 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే లాథూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టిన 25 తులాల బంగారు నగలకు సంబంధించిన రశీదులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డీసీపీ జయలక్ష్మి తెలిపారు.