తీరు మారని యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు బీ-కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు మార్గద ర్శకాలను పాటించడం లేదు. ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు ఫారాలను కళాశాల వెబ్‌సైట్‌లో, నోటీసుబోర్డులో అందుబాటులో ఉంచడంతో పాటు ఉన్నత విద్యామండలి, అఫ్లియేషన్ ఉన్న యూనివర్సిటీకి పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఆన్‌లైన్‌లో స్వీకరణ అంశం పక్కనబెడితే అసలు దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్న కళాశాలలే తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ఇప్పటివరకు కేవలం 224 కళాశాలలు మాత్రమే ఉన్నత విద్యామండలికి దరఖాస్తు ఫారాలను పంపించాయి. కన్వీనర్ కోటా అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యాజమాన్య కోటా భర్తీకి పేరున్న కళాశాలలతో పాటు వందలాది కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు జారీచేసినప్పటికీ.. దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచిన కళాశాలలు కేవలం 224 మాత్రమే కావడం విస్మయం కలిగిస్తోంది. పైగా వీటిలో పేరున్న పెద్ద కళాశాల ఒక్కటీ లేదు. ఈ 224లో ఫార్మసీ కళాశాలలు కూడా ఉన్నాయి. దాదాపు 673 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నా.. నామమాత్రంగా కొన్ని కళాశాలలు మాత్రమే బీ-కేటగిరీ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చిన్న కళాశాలలు విధిగా దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచడంతో పాటు రుసుం కూడా కేవలం రూ.200గా ఖరారు చేశాయి. అయితే కొన్ని కళాశాలలు మాత్రం రూ.2 వేల వరకు ఖరారు చేశాయి.
అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం కారణంగా ఇప్పటికే రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారని, డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారని, ఈ ఏడాది యాజమాన్య కోటా సీట్లకు అసలు డిమాండే లేదని హోలీ మేరీ గ్రూప్ సంస్థల చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘దాదాపు 20 వేల మంది విద్యార్థులు వలస వెళ్లినట్టు అంచనా. హైదరాబాద్‌లో అగ్రశ్రేణిలో ఉన్న దాదాపు 25 కళాశాలలకు యాజమాన్య కోటా పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వాటి పరిస్థితి కష్టంగా కనిపిస్తోంది. సీట్ల భర్తీ ఎలా ఉన్నా అన్ని కళాశాలలు దరఖాస్తులు అందుబాటులో ఉంచి పారదర్శకంగా భర్తీ చేయడం కళాశాలలకే మేలు చేస్తుంది’ అని అనురాగ్ గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకటిరెండు ప్రధాన కళాశాలలు తమ వెబ్‌సైట్లలో దరఖాస్తు ఫారాలను పొందుపరిచినప్పటికీ ఇంతవరకు ఉన్నత విద్యామండలికి పంపలేదు. అవి పంపేలోగా.. దరఖాస్తులు పంపేందుకు వారిచ్చిన గడువు ముగిసిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు.
డ్యూ అక్నాలెడ్జిమెంట్ మరచిపోకండి..
యాజమాన్య కోటా సీటు కోసం దరఖాస్తు ఫారాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ ఠీఠీఠీ.్చఞటఛిజ్ఛి.ౌటజ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు ఫారం నింపి, నిర్దేశిత రుసుం డీడీ ద్వారా చెల్లించి, ధ్రువపత్రాలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తు ముట్టినట్టుగా ఆధారం ఉండాలంటే రిజిస్టర్డ్ పోస్టు చేసేటప్పుడు అక్నాలెడ్జిమెంట్ కార్డును కూడా తప్పనిసరిగా జతపరచాలి. పోస్టాఫీస్‌లో నామమాత్రపు రుసుం ద్వారా ఈ అక్నాలెడ్జిమెంట్ కార్డు అందుబాటులో ఉంటుంది.