మంచి తిథి, వారం కలిసిరావడంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇ
సాక్షి, నెల్లూరు: మంచి తిథి, వారం కలిసిరావడంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఒక్క రోజే గడువు ఉండడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లకు 216, కావలి మున్సిపాలిటీలో 73, సూళ్లూరుపేటలో 27, గూడూరులో 24, వెంకటగిరిలో 31, ఆత్మకూరులో 33, నాయుడుపేటలో 5 నామినేషన్లు వచ్చాయి.
నెల్లూరు మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన డాక్టర్ జడ్.శివప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రెండు రోజులు తిథులు బాగ లేకపోవడంతో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. బుధవారం ఒక్కసారిగా ఊపందుకోవడంతో నామినేషన్ స్వీకరణ కేంద్రాలన్నీ అభ్యర్థులు, వారి ప్రతిపాదకులతో కిటకిటలాడాయి. గురువారం చివరి రోజు కావడంతో ఈ సందడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ జాన్‌శ్యాంసన్ నగరంలోని 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు సూచనలిచ్చారు.