
అంబేడ్కర్ అందరివాడు కాదా..
సీఎం వెళ్లే వరకు ఎదురుచూపులు
కారెం శివాజీ జెండాలతో హల్‌చల్
విజయవాడ(భవానీపురం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడు కాదా.. కొందరికే పరిమితమా..! పోలీసు పహారా మధ్య అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు. పైగా ముఖ్యమంత్రి వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించే వరకు మిగిలిన ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నాయకులకు పోలీసులు అనుమతించకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9.15కు వస్తారని సమాచార శాఖ ప్రకటించింది. ఆయన 10.40 గంటల సమయంలో వచ్చి నివాళి అర్పించి వెళ్లిపోయారు. సీపీఐ తదితర ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు.
మాలమహానాడు జెండాలతో శివాజి హల్‌చల్..
మాల మహానాడు నాయకుడు, ఎస్టీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బుధవారం నియమితులైన కారెం శివాజీ పదవి వచ్చిన రెండో రోజే హల్‌చల్ చేయడంపై పలువురు నివ్వెరబోయారు. ప్రభుత్వ కార్యక్రమంలో మాలమహానాడు జెండాలను ప్రదర్శించే యత్నం చేసిన శివాజీ అనుచరులను డీసీపి కాళిదాసు వారించారు. కొద్దిసేపు శివాజీ కాళిదాసుతో వాదించినా చివరికి జెండాలను తొలగించక తప్పలేదు. తిరిగి శివాజి అనుచరులు ప్లకార్డులు తీసుకువచ్చి చేతపట్టుకున్నారు. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఒప్పుకోలేదు. మళ్లీ ఆయనతో శివాజీ వాగ్వాదానికి దిగారు. సీఎం ఫొటో ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేమిటని వాదనకు దిగారు. దానిపై మీ ఫొటో కూడా ఉంది కదా అని సీఐ అనడంతో మంత్రి కిషోర్ పెట్టుకోమన్నారని చెప్పారు. సీఐ మంత్రితో మాట్లాడిన తరువాత వాటిని ప్రదర్శించారు.
మండుటెండలో హాస్టల్ విద్యార్థినీలు..
సీఎం వస్తున్నారని కస్తూరిబాయిపేటలోని బాలికల హాస్టల్లోని విద్యార్థినీలను తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు తీసుకువచ్చారు. వారిని అంబేడ్కర్ విగ్రహ సమీప వంతెన ప్లాట్‌ఫాంపై కూర్చోపెట్టారు. దాదాపు గంటకుపైగా మండుటెండలో కూర్చోలేక వారు నానా అవస్థలుపడ్డారు. సీఎం పది నిముషాలలో వస్తారనగా వారిని తీసుకువెళ్లి షామియానాలో కూర్చోపెట్టారు.